సావిత్రి రోల్ కి ముందు సమంత సైన్ చేసింది

అభినేత్రి సావిత్రి బయోపిక్ మూవీ ‘మహానటి’ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్న దత్ ‘స్వప్న సినిమా’ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా మరొక స్టార్ హీరోయిన్ సమంత అలనాటి నటి జమున పాత్ర పోశిస్తున్నారు. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. సావిత్రి పాత్రకు ముందు సమంతనే ఎంపిక చేశారంట. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర నిర్మాత స్వప్నా దత్‌ వెల్లడించారు. ఈ సినిమా గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ … ‘ సావిత్రి గారి పాత్రకు కీర్తి సురేశ్‌ కంటే ముందు సమంతే సంతకం చేశారు. కానీ ఆ పాత్రలో కొత్తవారిని తీసుకుంటే బాగుంటుందని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ భావించారు.

అందుకే కీర్తి సురేశ్‌ను ఎంపిక చేసుకున్నాం. కీర్తి ఈ సినిమాకి సంతకం చేసినప్పుడు ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు చాలా కొత్త’ అని చెప్పారు. ఇంకా ఆమె మాట్లాడుతూ “సావిత్రి గారు ఒక్క నిముషంలో వంద హావభావాలను పలికించగల గొప్ప నటి. ఆమె పాత్రలు ఎలా ఉండేవో ముందు మేం అర్థం చేసుకోవాలి. సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరిని కలిసి ఆమె గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. సావిత్రికి సంబంధించిన చాలా ఫొటోలు సేకరించాం. కేవలం సావిత్రిగారి జ్ఞాపకార్థంగా ఓ గ్రంథాలయం ఏర్పాటుచేసుకోవాలని ఉంది.”అని స్వప్న వివరించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus