ప్రముఖ తమిళ హీరో విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా మారి మెగా ఫోన్ పట్టుకున్న విషయం తెలిసిందే. హీరోగా ఎంట్రీ ఇస్తాడేమో అనుకుంటే కెప్టెన్ అవుతా అంటూ షాకిచ్చిన జేసన్ సంజయ్.. ఇప్పుడు మరో షాకిచ్చాడు అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. సందీప్ కిషన్ హీరోగా జేసన్ సంజయ్ ‘సిగ్మా’ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా చిత్రీకరణను రెండు నెలల్లో దాదాపు పూర్తి చేశారు అనే వార్తలు వస్తున్నాయి.
తొలిసారి దర్శకత్వం వహిస్తున్నప్పటికీ జేసన్ సంజయ్ షూటింగ్ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాడని.. 65 రోజుల్లో 95 శాతం షూటింగ్ పూర్తి చేశాడని తమిళ సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన సినిమా విడుదలకు కూడా ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు అని అంటున్నారు. అందుకే తర్వాతి సినిమాను కూడా జేసన్ తమ బ్యానర్‌లోనే మరో సినిమా చేయాలని కోరుకుంటున్నామని టీమ్ అఫీషియల్‌గా ట్వీట్ కూడా చేసింది.
ట్రెజర్ హంట్, క్రిమినల్ హైస్ట్, యాక్షన్, అడ్వెంచర్ జానర్‌లో ఈ సినిమా జేసన్ సంజయ్ రాసుకున్నారు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా మెయిన్ లీడ్‌గా సినిమాను ప్రారంభించారు. వచ్చే వేసవిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ లెక్కన ఈ సినిమా చాలా ప్రతిష్ఠాత్మకంగా మారింది. విజయ్ తనయుడు దర్శకుడు అంటే ఆ మాత్రం ఉంటుంది. ఇక సందీప్‌కి ఈ సినిమా ఊహించని విషయం. మామూలు సినిమానే ఆయన భారీగా ప్రచారం చేస్తాడు. ఇక ఈ సినిమాకు ఏ లెవల్‌లో చేస్తాడో చూడాలి.
తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సందీప్‌కి ఇక్కడ పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. విజయ్ తనయుడి ఫస్ట్ సినిమా కాబట్టి లైకా ప్రొడక్షన్స్ కూడా అన్ని భాషల్లో విడుదల చేయడానికి చూస్తుంది.