కోట్లాది రూపాయలు పారితోషికం తీసుకునే హీరోహీరోయిన్లే చిత్రం కోసం కాలికి బలపం కట్టుకుని తిరుగుతూ.. ప్రచారం చేస్తున్నారని దర్శక హీరో అమీర్ అన్నారు. విమల్ , తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కులసామి’. దర్శకుడు శరవణన్ శక్తి కుమారుడు సూర్య ప్రతి నాయకుడి పాత్రను పోషించారు. ఈ నెల 21న విడుదలకానున్న ఈ చిత్రాన్ని ఎంఐకే ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానరులో నిర్మించారు. శరవణన్ శక్తి దర్శకత్వం వహించగా, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి మాటలు అందించారు.
ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ రిలీజ్ వేడుక సోమవారం రాత్రి చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు అమీర్ మాట్లాడుతూ… ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి చిత్రాలకే ప్రమోషన్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కోట్లాది రూపాయలు పారితోషికం తీసుకునే నటీనటులు తాము నటించిన చిత్రాల ప్రమోషన్ల కోసం దేశాన్ని చుట్టేస్తున్నారు. కానీ, ఈ చిత్రం ఆడియో విడుదలకు హీరోహీరోయిన్లు రాకపోవడం విచారకరం.
ఆ లోటును ఐపీఎస్ మాజీ అధికారి జాంగిడ్ తీర్చారని అన్నారు. ఈ చిత్రంలో ఒక పాత్రను పోషించిన ఐపీఎస్ మాజీ అధికారి జాంగిడ్ మాట్లాడుతూ.. నేను ఒక తమిళ చిత్రంలో నటించానన్న వార్తను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. సినిమాల్లో నటించడం చాలా సులభమని భావించాను. కానీ, నా భావన తప్పని గ్రహించానని అన్నారు.
చిత్ర దర్శకుడు శరవణన్ (Saravanan Sakthi) శక్తి మాట్లాడుతూ.. విజయ్ సేతుపతి డైలాగులు రాసి ఇవ్వని పక్షంలో ఈ సినిమా కార్యరూపం దాల్చేది కాదు. ఈ చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. అలాగే, చిత్ర సంగీత దర్శకుడు మహాలింగం, నిర్మాత సురేష్ కామాక్షి, డీవోపీ వైట్ యాంగిల్ రవి, నిర్మాత ఆదంభవ తదతరులు ప్రసంగించారు.