ఈసారి దేవి శ్రీ ప్రసాద్ పాసైపోయాడు..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 11న విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మహేష్ బాబు గత చిత్రం ‘మహర్షి’ చిత్రానికి కూడా ఈయనే సంగీతం అందించాడు. అయితే ఆ చిత్రం ఆడియోకి మిశ్రమ స్పందన లభించింది. మహేష్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లను రాబట్టినప్పటికీ… ఓవర్సీస్ లో జస్ట్ యావరేజ్ గా మాత్రమే నిలిచింది. ఇందుకు కారణం ఆడియో ఆకట్టుకోకపోవడం వలనే.. అని ట్రేడ్ పండితులు సైతం క్లారిటీ ఇచ్చారు. ఈ కారణంతో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు అని అనౌన్స్ చేసిన వెంటనే మహేష్ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. అయితే ‘ఈసారి కచ్చితంగా మంచి ఆల్బం ఇస్తానని’ వారికి ప్రామిస్ చేసాడు దేవి. డిసెంబర్ నెలంతా ఈ చిత్రం పాటలతో హోరెత్తించారు. తాజాగా ఫుల్ జ్యూక్ బాక్స్ ను విడుదల చేశారు. మరి ఈ పాటలన్నీ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :

1) మైండ్ బ్లాక్ : శ్రీమణి, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కలిసి ఈ మాస్ సాంగ్ కు లిరిక్స్ అందించారు. ఫుల్ మాస్ బీట్స్ తో ఇంగ్లీష్ పదాలతో ఈ పాట సాగింది. బ్లాజ్, రనీనా రెడ్డి కలిసి ఈ పాటను ఎంతో జోష్ తో పాడారు. మధ్య మధ్యలో మహేష్ వాయిస్ హైలెట్ అని చెప్పొచ్చు. క్లాస్ ఆడియన్స్ కు ఈ పాట పెద్దగా నచ్చకపోయినా.. మాస్ ఆడియన్స్ ను ముఖ్యంగా మహేష్ అభిమానుల్ని ఈ పాట బాగా ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు. విజువల్ గా కూడా ఈ పాట బాగా వచ్చిందని దర్శకుడు అనిల్ రావిపూడి చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఈ పాటలో మహేష్ లుంగీ ధరించి స్టెప్ లు వేసినట్టు కూడా చెబుతున్నారు. ట్రైలర్ లో కూడా ఈ ఈ పాటలోని విజువల్ ను చూపించి ఊరిస్తున్నారు. మరి విజువల్ గా ఈ పాట భాగుంటే.. క్లాస్ ఆడియన్స్ కూడా శాటిస్ఫై అయిపోతారు అనడంలో సందేహం లేదు.

2) సూర్యుడివో చంద్రుడివో : రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటని… బి. ప్రాక్ అనే కొత్త సింగర్ ఆలపించాడు. తన గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోసాడనే చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ లో ఈ పాట ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ పాటలో విజయశాంతి, మహేష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనున్నారని సమాచారం. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే విధంగా ఈ పాట ఉంది. సో ఈ పాట పాసైపోయిందనే చెప్పాలి.

3) ‘హి ఈజ్ సో క్యూట్’ : శ్రీమణి లిరిక్స్ అందించిన ఈ పాటని మధు ప్రియా పాడింది. మహేష్ బాబు గ్లామర్ ను వర్ణిస్తూ… ముఖ్యంగా అమ్మాయిలు… అందగాడు అయిన మన మహేష్ ను ఎలా పొగుడుకుంటారు అనేది తెలుసుకుని శ్రీమణి ఈ పాటని రాసినట్టు తెలుస్తుంది.
సినిమా ఫస్ట్ హాఫ్ లో ఓ చోట ట్రైన్ ఆగిపోయినప్పుడు మహేష్ ను టీజ్ చేస్తూ హీరోయిన్ రష్మిక మందన ఈ పాట పాడుకుంటుందని స్పష్టమవుతుంది. ఈ పాట కచ్చితంగా ఓ చార్ట్ బస్టర్ అనే చెప్పాలి.

4) సరిలేరు నీకెవ్వరు (టైటిల్ సాంగ్) : మన కోసం బోర్డర్ లో నిద్రహారాలు కూడా లేకుండా కాపలా కాస్తోన్న మన ‘ఇండియన్ ఆర్మీ’ కి అంకితమిస్తూ ఈ పాటను రాసాడు దేవి శ్రీ ప్రసాద్. ఈ పాట కోసం ఎంతోమంది టెక్నికల్ నిపుణులు పని చేశారు. శంకర్ మహదేవన్ పాడిన ఈ పాట వింటుంటే ప్రతీ ఒక్కరికీ గూజ్ బంప్స్ రావడం ఖాయం. ఫస్ట్ హాఫ్ లోనే ఈ పాట ఉండబోతుందని తెలుస్తుంది. ముఖ్యంగా పాట చివర్లో వచ్చే మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు. ఈ పాట కూడా సూపర్ హిట్ అనే చెప్పాలి.

5) డ్యాంగ్ డ్యాంగ్ : రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటని అజీజ్ మరియు లవిత లోబో ఎంతో జోష్ తో పాడారు. ఈ పాట ఎలా ఉండబోతుందో ఇప్పటికే అందరికీ తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ప్రోమోని విడుదల చేశారు. తమన్నా, మహేష్ లు ఈ పాటలో పోటీపడి డ్యాన్స్ చేయడం మనం చూసాం. పక్కా పార్టీ సాంగ్ ఇది.. థియేటర్లలో ఈ పాటకి అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఖాయమనిపిస్తుంది. సో ఈ పాట కూడా సూపర్ హిట్టే.. అని చెప్పాలి.

చివరి మాట : దేవి శ్రీ ప్రసాద్ కచ్చితంగా అదిపోయే రేంజ్లో ఆల్బం ఇవ్వలేదు కానీ.. కచ్చితంగా ఓ కమర్షియల్ సినిమాకి ఏ ఆల్బం అవసరమో.. ఆ స్థాయి సాంగీతం అందించడంలో సక్సెస్ సాధించాడు. ఓవరాల్ గా ‘సరిలేరు నీకెవ్వరు’ ఆల్బం హిట్. మరి సినిమా ఎలా ఉండబోతుందో.. జనవరి 11న చూద్దాం..! మీతో పాటు మేము కూడా వెయిటింగ్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus