సార్పట్ట సినిమా రివ్యూ & రేటింగ్!

  • July 23, 2021 / 10:21 AM IST

రజనీకాంత్ తో “కబాలి, కాలా” లాంటి డిజాస్టర్ సినిమాలు తీసిన పా.రంజిత్ తెరకెక్కించిన చిత్రం “సార్పట్ట”. ఆర్య కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం బాక్సింగ్ నేపధ్యంలో తెరకెక్కింది. సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమా ఏస్థాయిలో ఉందో చూద్దాం..!!

కథ: భారతదేశాన్ని ఎమెర్జెన్సీ చట్టం నానా ఇబ్బందులకు గురి చేస్తున్న తరుణంలో.. చెన్నై మాత్రం డి.ఎం.కె పాలనలో ఎమెర్జెన్సీని ఎదిరించి మంచి జీవితాన్ని సాగిస్తుంటారు. ఆ శాంతి పరిపాలనలో బాక్సింగ్ ద్వారా పరువు, పరంపర కోసం తన్నుకు చస్తుంటాయి కొన్ని వర్గాలు. అందులో ముఖ్యుడు రంగయ్య (పశుపతి). ఆయన స్థాపించిన సార్పట్ట పరంపర, సింహాచలం (జి.ఎం.సుందర్) స్థాపించిన ఇడియప్ప పరంపర మొదటి స్థానం కోసం ప్రతి ఏడాది పోటీ పడుతూనే ఉంటారు.

ఆ క్రమంలో.. సార్పట్ట పరంపర నుంచు సమర (ఆర్య), ఇడియప్ప పరంపర నుంచి వేటపులి (జాన్ కొక్కెన్) పోటీకి సిద్ధమవుతారు. అయితే.. ఈ పోటీ కేవలం రెండు బృందాల నడుమ బాక్సింగ్ పోటీలా కాక, రెండు వర్గాల నడుమ ఆధిక్యత ప్రదర్శించుకొనే పోటీగా మారిపోతుంది.

ఎవరు గెలిచారు అనే కంటే ఎవరు నిలబడ్డారు అనేది ముఖ్యాంశంగా తెరకెక్కిన చిత్రం “సార్పట్ట పరంపర”.

నటీనటుల పనితీరు: ఒకరి గురించి చెప్పి మరొకరి గురించి చెప్పకుండా ఉండడానికి వీల్లేని క్యాస్టింగ్ ఉంది ఈ సినిమాలో. హీరో నుంచి సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు ప్రతి ఒక్కరూ అద్భుతమైన అభినయంతో ఆకట్టుకున్నారు. ఆర్య హార్డ్ వర్క్ ను ముందుగా మెచ్చుకోవాలి. ఈ సినిమాలో వేరియేషన్స్ చూపించడం కోసం తన శరీరాకృతిని మార్చుకున్న విధానం, బాడీ లాంగ్వేజ్, ఎటువంటి ఈగోలకి పోకుండా నటించిన సన్నివేశాలు అతడికి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

మంగమ్మగా దూషారా విజయన్ అదరగొట్టేసింది. “ఆకాశమే నీ హద్దురా” తర్వాత ఆస్థాయిలో స్ట్రాంగ్ ఉమెన్ రోల్ మంగమ్మ అని చెప్పొచ్చు. ఆమె నటన, స్క్రీన్ ప్రెజన్స్, ఎనర్జీ అద్భుతం. ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటనకు, హావభావాలు విజిల్స్ పడేవి.

పలు తమిళ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన పశుపతికి చాన్నాళ్ల తర్వాత మంచి పాత్ర లభించింది. ఆయన కూడా వచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకున్నారు.

విశాల్ “డిటెక్టివ్” సినిమాతో తెలుగు ఆడియన్స్ కి బాగా రిజిష్టర్ అయిన జాన్ విజయ్ ఈ చిత్రంలో పోషించిన డాడీ క్యారెక్టర్ అతడి కెరీర్ లో ఓ మైలురాయి పాత్రగా చెప్పుకోవచ్చు.

జాన్ కొక్కెన్, కలైరసన్, అనుపమ, షబ్బీర్ ఇలా ప్రతి ఒక్కరు పాత్రకు ప్రాణం పోశారు. ఈ పాత్రల కోసమే పుట్టారు అన్నట్లుగా కనిపించారు సినిమాలో.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు పా.రంజిత్ అద్భుతమైన కథకుడు. ఒక కథలో తాను అనుకున్న అంశాలను మేళవించి, దానికి కమర్షియల్ హంగులు అద్ది.. పక్కా క్లాస్ సినిమాను కూడా మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చేయగల సిద్ధహస్తుడు. అందుకే.. అతడి “మద్రాస్” సినిమాకి ఇప్పటికీ ఫాన్స్ ఉన్నారు. ఆ తర్వాత తెరకెక్కించిన “కబాలి, కాలా” రజనీకాంత్ స్టార్ డమ్ కిందిపడి డాం అన్నాయి కానీ.. అందులోనూ కొన్ని సన్నివేశాల్లో తాను చెప్పాలనుకున్న అంశాల్ని చక్కగా చెప్పాడు రంజిత్. అయితే.. “సార్పట్ట” విషయంలో అతడిని హైప్ గోల లేదు, స్టార్ డం పెంట లేదు.

అందువల్ల ఎలాంటి సైడ్ ట్రాక్స్ లేకుండా.. 70ల కాలం నేపథ్యంలో, బాక్సింగ్ కథాంశంతో, వర్గ విబేధాలను, కుల సంఘర్షణలను అత్యద్భుతంగా ప్రెజంట్ చేసాడు రంజిత్. రంజిత్ రాసుకున్న ప్రతి పాత్ర ఒక జీవిత సత్యాన్ని చెబుతుంది. ఒక సినిమాలోని ప్రతి పాత్ర ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలగడం అనేది మామూలు విషయం కాదు. అందులో రంజిత్ ఘన విజయం సాధించాడు.

కెమెరామెన్ మురళి పనితనం సినిమాకి పెద్ద ఎస్సెట్. 70 నేపధ్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపడంలో అతడు తీసుకున్న శ్రద్ధ అభినందనీయం. ఎడిటింగ్, కలరింగ్, ఆర్ట్ & ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్ ఇందుకు సహకరించిన విధానం ప్రశంసనీయం.

విశ్లేషణ: కుల వివక్ష, వర్గ బేధం అనేవి మనిషిలో అనాదిగా ఇమిడిపోయిన ఎమోషన్స్. కొందరు పైకి చూపిస్తే.. ఇంకొందరు లోపల దాచుకొని రగిలిపోతుంటారు. ఆ వివక్షాగ్నిలో పడి మగ్గిపోయిన ఎన్నో జీవితాలకు ఓ సమాధానం లాంటి సినిమా “సార్పట్ట”. అక్కడక్కడా కనిపించే తెలుగు ఫాంట్స్ విషయంలో కనీస జాగ్రత్త తీసుకోలేదు అనే కోపం తప్పితే.. సినిమా చూస్తుంతసేపు “ఎంత అద్భుతంగా రాసాడు, తీసాడు” అనుకుంటూ సినిమాలో లీనం అయిపోతారు తెలుగు ప్రేక్షకులందరూ. జాత్యంకారం అనేది మనిషిలో ఎంతలా పాతుకుపోయింది అనే విషయాన్ని తెలుసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది.

రేటింగ్: 3.5/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus