ఓ సగటు సినిమా అభిమానిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి, అనంతరం నిర్మాతగా మారిన అహితేజ బెల్లంకొండ నిర్మించిన రెండో చిత్రం “శశివదనే”. మూడేళ్ల క్రితం మొదలైన ఈ చిత్రం పలు ఇబ్బందులను ఎదుర్కొని ఎట్టకేలకు ఇవాళ (అక్టోబర్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈమధ్యకాలంలో ఇలాంటి క్లైమాక్స్ రాలేదు అంటూ మేకర్స్ బల్లగుద్ది మరీ చెప్పుకొచ్చారు. మరి ఆ క్లైమాక్స్ ఏంటి? సినిమా ఏమేరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది? అనేది చూద్దాం..!!
కథ: రాఘవ (రక్షిత్ అట్లూరి) డిగ్రీ పాసై, మంచి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేయడం కోసం ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాయడానికి సన్నద్దమవుతుంటాడు. ఆ క్రమంలో ఒకరోజు రోడ్డు మీద చూసిన శశి (కోమలి ప్రసాద్)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు.
చూపులతో మొదలైన ప్రేమ పెళ్లి దాకా వెళ్లగలిగిందా? అందుకోసం వాళ్లు ఎదుర్కొన్న సమస్యలేమిటి? మేకర్స్ ఎంతో నమ్మిన క్లైమాక్స్ సినిమాని నిలబెట్టగలిగిందా? వంటి ప్రశ్నలకు సమాధానమే “శశివదనే”.
నటీనటుల పనితీరు: నటుడిగా రక్షిత్ ప్రతి సినిమాతోనూ ఇంప్రూవ్ అవుతున్నాడు. ఈ సినిమాలో ఓ సగటు కుర్రాడిగా చాలా సహజంగా కనిపించాడు. అలాగే లుక్స్ పరంగా వేరియేషన్స్ చూపించగలిగాడు. హావభావాల విషయంలో ఇంకాస్త పరిణితి అవసరం.
కోమలి ఒక్క ఇంట్రడక్షన్ సీన్ తప్ప, సినిమా మొత్తం చాలా అందంగా, అణుకువగా, ఒద్దికగా కనిపించింది. ఆమె క్యారెక్టరైజేషన్ ను పెద్దగా ఎక్స్ ప్లోర్ చేయలేదు కానీ.. సినిమాకి మంచి గ్లామర్ యాడ్ చేయడంలో సక్సెస్ అయ్యింది.
శ్రీమాన్ తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. చాలా రిలేటబుల్ గా ఉంటుంది క్యారెక్టర్. అలాగే.. స్నేహితుడి పాత్రలో సుబ్రహ్మణ్యం కామెడీ టైమింగ్ తో ఆకట్టుకోవడానికి ప్రయత్నించాడు.
సాంకేతికవర్గం పనితీరు: ముందుగా శరవణ వాసుదేవన్ సంగీతం గురించి మాట్లాడుకోవాలి. చాలా మంచి పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. అయితే.. సౌండ్ మిక్సింగ్ సరిగా చేయకపోవడంతో.. ఒక్కోసారి డైలాగ్స్ ను మ్యూజిక్ డామినేట్ చేస్తే.. పాటలు ఓవర్ లే అయ్యాయి. ఇన్నాళ్లు కష్టపడిన బృందం, మిక్సింగ్ ను అలా అరకొరగా వదిలేయడం అనేది మైనస్ గా మారింది.
సాయికుమార్ దార సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. గోదావరి అందాలను స్వచ్ఛంగా చూపించాడు. అయితే.. బ్లర్ షాట్స్ ఎక్కువవ్వడంతో అది ఫోకస్ పుల్లింగ్ వల్ల ఎదురైన ఇబ్బందా? లేక ఎడిటింగ్ ఎఫెక్ట్ గా అనేది సరిగా అర్థం కాదు.
ప్రొడక్షన్ & కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్స్ మాత్రం తమ 100% ఎఫర్ట్స్ పెట్టారు. సినిమా మొత్తం హీరోయిన్ డ్రెస్సింగ్ స్టైల్ & కలర్ కాంబినేషన్ ప్లెజెంట్ గా ఉన్నాయి.
ఇక దర్శకుడు సాయిమోహన్ ఉబ్బన పనితనం విషయానికి వస్తే.. మూలకథలో ఉన్న కొత్తదనాన్ని, కథనంలో చూపించడంలో విఫలమయ్యాడు. ఫ్రేమింగ్స్ బాగున్నాయి, లొకేషన్స్ బాగున్నాయి కానీ.. సన్నివేశాలు ఎక్కడ? ఒక కథ రెండు పాత్రల మధ్య నడుస్తుందా? ఇంకొన్ని పాత్రలు యాడ్ అవుతాయా? అనేది పక్కన పెడితే.. కథనం ముందుకు సాగడానికి సదరు పాత్రల వ్యవహారశైలి లేదా క్యారెక్టరైజేషన్ ఎలా ఉపయోగపడుతుంది అనేది కీలకమైన అంశం. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అసలు సినిమాకి కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏంటి? ఆ పాయింట్ దాకా ఎందుకు వచ్చింది? అది అంత సీరియస్ పాయింటా? అంటే.. ఏమో సరిగా వర్కవుట్ అవ్వలేదనే చెప్పాలి. ఇక “నిరీక్షణ” రేంజ్ క్లైమాక్స్ లా ఉంటుందేమో అని ఎదురుచూసిన ప్రేక్షకులు తీరా అది చూసాక అంత గొప్పగా ఏముంది? ఇందులో అనుకోని థియేటర్ల నుండి అసంతృప్తితో బయటకు వెళ్తారు. సో, దర్శకుడిగా, కథకుడిగా సాయిమోహన్ అలరించలేకపోయాడనే చెప్పాలి.
విశ్లేషణ: ఒక్కో రచయిత కథను ఒక్కోలా కన్సీవ్ చేస్తారు. కొందరు స్ట్రక్చర్ ముందు ఫిక్స్ అవుతారు, కొందరు ఒక పాయింట్ ను ముందు డిసైడ్ అయ్యి, తర్వాత కథ మొదలుపెడతారు. ఇంకొందరు ఒక సన్నివేశాన్ని లాక్ చేసుకుని అనంతరం కథనం రాసుకుంటారు. మరి సాయిమోహన్ ఈ లిస్ట్ లో ఏది ఫాలో అయ్యాడో తెలియదు కానీ.. తాను అనుకున్న పాయింట్ ను సినిమాగా తెరకెక్కించడంలో, ఆ తెరకెక్కించిన సినిమాతో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయడంలో తడబడ్డాడు. అందువల్ల కొన్ని మూమెంట్స్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ వంటివి బాగున్నప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం “శశివదనే” అలరించలేకపోయింది.
ఫోకస్ పాయింట్: వదనంలో ఉన్న కళ.. కథనంలో కొరవడింది!
రేటింగ్: 1.5/5