మాధవన్ కి కృతజ్ఞత లేఖ రాసిన చందూ మొండేటి.!

యువ దర్శకుడు చందూ మొండేటి యువహీరో నిఖిల్ తో “కార్తికేయ” అనే థ్రిల్లర్ మూవీని తెరకెక్కించి మంచి విజయం సాధించారు. తర్వాత “ప్రేమమ్’ మలయాళ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో నాగచైతన్యతో రీమేక్ చేసి మరో హిట్టు తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా నాగచైతన్యతో యాక్షన్ జానర్‌లో “సవ్యసాచి” డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. మాధవన్‌, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో మాధవన్‌కు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా  చందూ మొండేటి లేఖ రాశారు. “డియర్‌ మ్యాడీ సర్‌.. మేం మీతో ప్రేమలో పడి 17 ఏళ్లు కావొస్తోంది.

దర్శకుడిని నమ్మి అతని విజన్‌ను మెరుగుపరిచే ఓ గొప్ప నటుడు, జెంటిల్‌మెన్‌తో కలిసి మేం పనిచేసినందుకు చాలా గర్విస్తున్నాం. ఎప్పటిలాగే మీ స్టార్‌డం ఈ ప్రాజెక్ట్‌ విలువను మరింత పెంచింది. తెరపై మిమ్మల్ని చూడటం ఎప్పుడూ మాకు కన్నులవిందుగానే ఉంటుంది. కానీ సెట్స్‌లో మీ ప్రదర్శన చూడటం మా అదృష్టంగా భావిస్తున్నాం. మీ నటనకు సెట్స్‌లోని ప్రతి ఒక్కరూ అభిమాని అయిపోయారు. ఇంతకుముందు మీరు నటించిన సినిమాలు మంచి విజయం సాధించినట్లే ఈ సినిమా కూడా అద్భుత విజయం సాధిస్తుందని  కోరుకుంటున్నాం. ప్రేమతో.. చందూమొండేటి, సవ్యసాచి చిత్రబృందం”  అని లేఖలో పేర్కొన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus