మల్టీప్లెక్స్ రేట్ల గురించి సామాన్యుడు ఎప్పుడూ గగ్గోలు పెడుతూనే ఉంటాడు. టికెట్ కంటే పాప్ కార్న్ రేటు ఎక్కువైపోతుందనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే రీసెంట్ గా పీవీఆర్ అధినేత అజయ్ బిజిలీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు దారితీశాయి. మా రేట్లు చాలా రీజనబుల్ అని ఆయన చెప్పడమే ఇప్పుడు నెటిజన్ల కోపానికి కారణమైంది.
అజయ్ బిజిలీ ఏమన్నారంటే.. పీవీఆర్ లో సగటు టికెట్ ధర కేవలం 259 రూపాయలు మాత్రమేనట. అలాగే పాప్ కార్న్ ధరలు కూడా 159 నుంచే మొదలవుతున్నాయని, ఇవి ఏమాత్రం ఎక్కువ కాదని ఆయన సమర్థించుకున్నారు. పేపర్ మీద ఈ లెక్కలు బాగానే ఉన్నా, గ్రౌండ్ లెవెల్ లో జనం అనుభవిస్తున్న బాదుడు వేరు. అందుకే ఆయన స్టేట్ మెంట్ చూడగానే నెటిజన్లు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.
దీనికి కౌంటర్ గా నెటిజన్లు లాజిక్ లతో కొట్టారు. ఆ సగటు ధర 259 అనేది కేవలం చిన్న ఊర్లలో ఉండే సింగిల్ స్క్రీన్స్, అప్పుడప్పుడు పెట్టే 99 ఆఫర్ల వల్ల తగ్గిందని గుర్తుచేస్తున్నారు. నిజానికి మెట్రో సిటీల్లో ప్రైమ్ సీటు కావాలంటే 500 నుంచి 800 వరకు ఈజీగా ఖర్చవుతుంది. ఈ సగటు లెక్కలు చూపి మభ్యపెట్టొద్దని ఓ యూజర్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
ఇక ఫుడ్ రేట్ల గురించి అయితే చెప్పక్కర్లేదు. కేవలం ఐదు రూపాయలు ఖర్చయ్యే మొక్కజొన్నను 159 రూపాయలకు అమ్మడం అంటే.. దాదాపు 3000 శాతం లాభం వేసుకోవడమే కదా అని మరో యూజర్ ప్రశ్నించారు. గాలిని కూడా ఇంత రేటు పెట్టి అమ్మేస్తారా అని సెటైర్లు వేస్తున్నారు. బయటి ఫుడ్ ను అనుమతించకపోవడం, పాప్ కార్న్ కాంబోలే 400 ఉండటంతో ఒక ఫ్యామిలీకి కనీసం వెయ్యి రూపాయలు దాటుతోంది. ఇలాంటి టైమ్ లో రేట్లు తక్కువ అని స్టేట్ మెంట్స్ ఇస్తే.. పుండు మీద కారం చల్లినట్టే ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.