Director Kongara : సినిమా ఇండస్ట్రీలో మేల్ డైరెక్టర్ల హవా ఎక్కువగా కనిపించే పరిస్థితుల్లో, తనదైన ఆలోచనలతో, బలమైన కథనంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లేడీ డైరెక్టర్లలో సుధా కొంగర పేరు ముందు వరుసలో ఉంటుంది. లేడీ డైరెక్టర్లు తక్కువే అయినా, వచ్చిన ప్రతి అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుని తనదైన శైలిలో క్వాలిటీ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నవారిలో సుధా కొంగర ఒకరు. అలాంటి ఆమె నుంచి తాజాగా వచ్చిన “రిటైర్మెంట్” వ్యాఖ్యలు అభిమానులను షాక్‌కు గురి చేస్తున్నాయి.
ప్రస్తుతం తమిళ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా తెరకెక్కిన పొలిటికల్ పీరియాడికల్ డ్రామా ‘పరాశక్తి’ సినిమాతో బిజీగా ఉన్న సుధా కొంగర… ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా తన మనసులోని మాటను బయటపెట్టింది. “నాకు లవ్ స్టోరీలు అంటే చాలా ఇష్టం. ఒక సంపూర్ణమైన ప్రేమకథను తెరకెక్కించడం నా కల. ఆ కథను రజినీకాంత్ లాంటి లెజెండ్ చేస్తే అదొక మర్చిపోలేని అనుభవం అవుతుంది. కానీ నిజం చెప్పాలంటే నేను బాగా అలసిపోయాను. అందుకే త్వరగానే రిటైర్ కావాలనుకుంటున్నాను” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… తన కెరీర్‌లో ఇప్పటివరకు సుధా కొంగర చేసినవి కేవలం 8 సినిమాలే. అయినా ఆమె ఖాతాలో ఉన్న హిట్లు మాత్రం బలమైనవే. ద్రోహితో దర్శకురాలిగా పరిచయమైన ఆమె, ఇరుధి సుత్రు (తెలుగులో గురు)తో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత సూరరై పొట్రు లాంటి బ్లాక్‌బస్టర్‌తో విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డుల వర్షం అందుకుంది. పావ కధైగళ్ వంటి కంటెంట్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్ కూడా ఆమె ప్రతిభకు నిదర్శనం.
విజయవాడలో తెలుగు కుటుంబంలో జన్మించిన సుధా కొంగర, తమిళ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసినా… తెలుగు అమ్మాయిగా మనకు మరింత గర్వకారణం. ఇలాంటి దశలో ఆమె రిటైర్మెంట్ మాటలు చెప్పడం అభిమానులను నిరాశపరుస్తున్నా, మరో అద్భుతమైన ప్రేమకథతో ఆమె కల నెరవేరాలని సినీప్రేమికులు కోరుకుంటున్నారు.