మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమాలో వేసిన వీణ స్టెప్పు అప్పట్లో అభిమానులతో విజిల్స్ వేయించింది. లారెన్స్ కంపోజ్ చేసిన ఆ స్టెప్పుకి ఏళ్ళు గడిచినా క్రేజ్ తగ్గలేదు. కొంత కాలం క్రితం వరకు ఈ స్టెప్పుని తెలుగు హీరోలు వేసి మెగాస్టార్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. మొన్న హైదరాబాద్లో జరిగిన ఫిల్మ్ ఫెర్ అవార్డుల కార్యక్రమంలో ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీతి సింగ్ వీణ స్టెప్పును అందంగా వేసి ఔరా అనిపించుకుంది. ఆమె స్టెప్ వేసిన తీరు చూసి చిరు సైతం చప్పట్లుకొట్టకుండా ఉండలేక పోయారు. ఇప్పుడు ఈ స్టెప్ బాలీవుడ్ కి పాకింది.
సాయేషా సైగల్ కూడా వీణ స్టెప్ ని ఇరగదీసింది. హిందీ పరిశ్రమకు చెందిన అగ్ర హీరో దిలీప్ కుమార్ కుటుంబం నుంచి వచ్చిన ఈ నటి అక్కినేని అఖిల్ తో కలిసి అఖిల్ సినిమాతో తెరంగ్రేటం చేసింది. ఈ భామ ప్రస్తుతం అజయ్ దేవగన్ తో కలిసి శివాయ చిత్రంలో నటించింది. ఈమె రెండురోజుల క్రితం సింగపూర్లో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకల్లో డాన్స్ ప్రదర్శన ఇచ్చింది. సాయేషా నృత్య ప్రదర్శనలో వీణ స్టెప్పు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలీవుడ్ నటుల్లో వీణ స్టెప్పుని వేసిన తొలి నటిగా ఆమె నిలిచింది. చిరు స్టెప్పు బాలీవుడ్ కథానాయకులను కూడా ఆకట్టుకోవడంపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.