దర్శకులు కథలు కాపీ చేసారని కొందరు మీడియా ముందు వాపోవడమే ఇప్పటివరకు చూశాం. ఇప్పుడు ఏకంగా దాడికి దిగుతున్నారు. వంద చిత్రాల దర్శకుడు కె.రాఘవేంద్ర రావు ఇంటిపై ఓ యువకుడు దాడి చేయడం హాట్ టాపిక్ గా మారింది.
అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఉద్దులవాడపల్లికి చెందిన 28 ఏళ్ల పి.రవీంద్ర ఫిలింనగర్ వెంచర్ -3లో నివసించే దర్శకేంద్రుని నివాసానికి గురువారం వచ్చాడు. “శ్రీరామదాసు(2006) మూవీ కథ నాదే. దానిని మీకు 2003లోనే పంపాను. అయినా కథా రచయితగా నాపేరు పెట్టకుండా మోసం చేశావు” అంటూ రాఘవేంద్ర రావును నిలదీశాడు. “శ్రీరామదాసు కథ జె.కె. భారవి ది, నీది కాదు” అని ఆయన చెప్పి కారులో బయటికి వెళ్ళిపోయాడు.
దీంతో రవీంద్ర ఆవేశపడి ఓ ఇనుపరాడ్డు తీసుకొని రాఘవేంద్రరావు ఇంటిలోని మూడు కార్లను, ఇంటి అద్దాలను పగలగొట్టాడు. అడ్డు వచ్చిన వాచ్ మెన్ పై దాడి చేశాడు. రాఘవేంద్రరావు కొడుకు ప్రకాశరావు బయటకు రాగా ఆయనపై కూడా దాడికి యత్నించాడు. చివరకు ప్రకాశరావు, వాచ్ మెన్ కలిసి రవీంద్రను పట్టుకుని, ఓ గదిలో బంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రవీంద్రను అరెస్టు చేశారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 452, 427కింద కేసులు నమోదుచేసి రిమాండ్ కు తరలించారు.
మితభాషి, వివాదరహితుడు కె.రాఘవేంద్ర రావు పై ఇలాంటి అభియోగం రావడం గురించి తెలుకున్న సినీ పండితులు విస్తుపోయారు. పదేళ్ల తర్వాత కథ తనదేనని గొడవ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో తెలియక తల పట్టుకుంటున్నారు.