టాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దశాబ్దాలుగా వెండితెరపై తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన సీనియర్ నటి, కమెడియన్ అయినటువంటి పావలా శ్యామల(Pavala Syamala) ఈరోజు కన్నుమూశారు. ఆమె వయసు 75 ఏళ్ళు.హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆమె పరిస్థితి ఈ మధ్య అత్యంత దయనీయంగా మారింది.
వయోభారం, తీవ్ర అనారోగ్యం కారణంగా ఆమె నటనకు దూరమైంది. దీంతో ఆర్ధికంగా బాగా నలిగిపోయింది. ఆమెను ఆదుకోవాల్సిన కుమార్తె కూడా మంచానికే పరిమితమవడంతో శ్యామలకి తలకిమించిన భారం అయ్యింది. డబ్బులు లేని కారణంగా ఈ ఏడాది మే నెలలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి వారు.. ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించి వెనక్కి పంపేయడం జరిగింది. అటు తర్వాత రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో పడుండటం అనేది సినీ లోకాన్ని కలచివేసింది.
పోలీసులు ఆమెను గుర్తించి మీడియాకి తెలియజేశారు. తర్వాత కొంతమంది పెద్దలు ముందుకొచ్చి ఆమెకు సాయం చేయడం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్, చిరంజీవి అలాగే తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వంటివారు ఆమెకు ఆర్థిక సాయం అందించినా.. అవి ఆమె వైధ్యానికి సరిపోలేదు. శ్యామల సినీ ప్రస్థానాన్ని గమనిస్తే.. 1980లలో ఆమె సినిమాల్లోకి అడుగుపెట్టింది. ‘ఇంద్ర’, ‘ఖడ్గం’, ‘వర్షం’ వంటి సూపర్ హిట్ సినిమాలు ఆమెకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టాయి.
వందల సినిమాల్లో తన మార్క్ నటనతో, కామిడీతో అలరించారు. ‘గోలీమార్’ సినిమాలో ఈమె పండించిన కామిడీ ఇప్పటికీ అంటే నేటితరం ప్రేక్షకులను కూడా అలరిస్తూనే ఉంది.