ఇప్పుడు అంటే ‘కొత్త లోక: చాప్టర్ 1’ సినిమా వచ్చి సూపర్ ‘హీరో’యిన్ అయిపోయింది కానీ.. అంతకుముందు వరకు క్యూట్ కల్యాణీనే. ఆ మాటకొస్తే ‘కొత్త లోక’ సినిమాలో కూడా క్యూట్‌గానే ఉందనుకోండి. ఇక అసలు విషయానికొస్తే.. ఈ భామ మనకు తెలిసింది ‘హలో’తో. అఖిల్ అక్కినేని హీరోగా రూపొందిన సినిమా అది. ఆ సినిమాతోనే ఆమె తెరంగేట్రం అయింది. అయిన ఆమె తండ్రి, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ఫస్ట్ రియాక్షన్ ఓకే అయి ఉంటే.. కల్యాణిని మనం అప్పుడు చూసేవాళ్లం కాదు. ఇంతకీ ఏమైందంటే?
కల్యాణి సినిమాల్లోకి వస్తుందని ప్రియదర్శన్ ఎప్పుడూ అనుకోలేదట. ఆర్కిటెక్ట్ కావాలన్నది ఆమె డ్రీమ్. దాని కోసం ప్రయత్నాలు చేస్తుండగా ఓ రోజు ప్రియదర్శన్‌కు.. నాగార్జున కాల్ చేశారట. ‘హలో!’ అని ఓ సినిమా చేస్తున్నాం అఖిల్ హీరోగా.. ఆ సినిమాలో హీరోయిన్‌గా మీ అమ్మాయిని అనుకుంటున్నాం అని అన్నారట. వెంటనే ప్రియదర్శన్ కల్యాణికి నటన రాదని చెప్పేశారట. సినిమాలో ఆమె నటించదు అని కూడా చెప్పారట.
అయితే కల్యాణి వచ్చి ‘ఒక్కసారి ప్రయత్నిస్తా నాన్నా.. పోయేది ఏముంది. ఒకవేళ నాకు సినిమా సెట్ కాలేకపోతే ఆర్కిటెక్ట్‌గా మళ్లీ నా ప్రయత్నాలు చేస్తా’ అని చెప్పిందట. దాంతో ప్రియదర్శన్ ఓకే చెప్పారు. అలా అఖిల్‌తో కలసి ఆమె ‘హలో’ అంది. ఆ సినిమా సరైన ఫలితం ఇవ్వకపోయినా ఆతర్వాత కొన్ని తెలుగు సినిమాలు చేసింది. ఏమైందో ఏమో మళ్లీ ఇటువైపు రాలేదు. 2019లో చేసిన ‘రణరంగమే’ ఆమె ఆఖరి తెలుగు సినిమా.
అలా అని మలయాళంలో స్టార్ ఈజీగా అయిపోయిందా అంటే.. కేరళలో పెరగకపోవడం కల్యాణి సరిగ్గా మలయాళం మాట్లాడలేకపోయేదట. దాని వల్ల కెరీర్ ప్రారంభంలో ఇబ్బందులు ఎదుర్కొందట. అయితే అక్కడ వెనకడుగు వేయకుండా భాష, పరిస్థితులపై అవగాహన లాంటివి నేర్చుకుని ఈ స్థాయికి చేరుకుంది అని ప్రియదర్శన్ చెప్పారు.