ప్రముఖ సంగీత దర్శకుడు, అర్జున్ (73) ఇటీవల హైదరాబాద్‌లో కన్నుమూశారు. తెలుగు, తమిళ, కన్నడ, భోజ్‌పురి భాషల్లో వందకుపైగా సినిమాలకు సంగీతం అందించిన ఆయన పూర్తి పేరు మల్లికార్జున శర్మ. అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో గత కొంత కాలంగా బాధపడుతున్న అర్జున్ తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అర్జున్ మృతితో తెలుగు సినిమా పెద్దలు, ఇతర సినిమాల పెద్దలు తమ కండొలెన్స్ తెలియజేశారు.
మల్లికార్జున శర్మ 1954లో కడపలో జన్మించారు. సంగీతంపై ఆసక్తితో చెన్నైకి వెళ్లి జి.కె.వెంకటేశ్, చక్రవర్తి తదితర అగ్ర దర్శకుల దగ్గర శిష్యరికం చేశారు. అక్కడే కొన్ని ఆల్బమ్ సాంగ్స్‌కు సంగీతం అందించారు. 2004లో హైదరాబాద్‌కు వచ్చిన ఆయన అర్జున్ పేరుతో కొన్ని సినిమాలకు సంగీతం అందించారు. అలా చేసిన వాటిలో ‘చిలుకూరు బాలాజీ’, ‘శ్రీ వాసవీ వైభవం’, ‘పరంపర’ లాంటి సినిమాలకు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. సంగీత దర్శకుడిగానే కాకుండా, గాయకుడిగా, గీత రచయితగానూ ఆయన సినిమాలు చేశారు.
అర్జున్ సతీమణి రాణి పులోజమా దేవి తెలుగు సినిమాల్లో పాటలు రాసేవారు. ఆమె 2015లో అనారోగ్యంతో కన్నుమూశారు. అర్జున్ – రాణి పులోజమా దేవి దంపతులకు జానకిరామ్, ప్రద్యోతన్ అని ఇద్దరు కుమారులు ఉన్నారు. ‘ఐస్‌క్రీమ్’ సినిమాతో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రద్యోతన్ ఆ తర్వాత కన్నడ పరిశ్రమలో సినిమాలు చేశారు. మరో అబ్బాయి అర్జున్‌కి కూడా సంగీతంలో ఉన్నవారే.