“చక్రవాకం, మొగలిరేకులు” సీరియల్స్ ద్వారా ప్రతి తెలుగింట్లో గుర్తింపు సంపాదించుకున్న నటుడు సాగర్ నాయుడు. హీరోగా గుర్తింపు పొందడం కోసం గత అయిదారేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేసే అవకాశం దక్కింది. సాగర్-దృశ్య రంగనాధ్ జంటగా నటించిన “షాదీ ముబారక్” నేడు (మార్చి 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతోనైనా సాగర్ నాయుడు హీరోగా విజయాన్ని అందుకున్నాడో లేదో చూద్దాం..!!
కథ: లైఫ్ కి సెటిల్మెంట్, మైండ్ కి మెచ్యూరిటీ వచ్చాక పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకొని ఒకేరోజు మూడు పెళ్ళిచూపులు సెట్ చేసుకుంటాడు మిస్టర్ సున్నిపెంట మాధవ్ (సాగర్ నాయుడు). మ్యారేజ్ బ్రోకర్ కి కాలు బెణకడంతో ఆమె స్థానంలో ఆమె కుమార్తె తుపాకుల సత్యభామ (దృశ్య రంగనాధ్) వస్తుంది. ఇద్దరూ కలిసి పెళ్లిచూపులకి వెళ్ళడం మొదలెట్టాక సత్యభామాపై ఇష్టం పెంచుకుంటాడు మాధవ్.
ఈ మూడు పెళ్ళిచూపులు మాధవ్-సత్యభామల లవ్ స్టోరీపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించాయి? చివరికి మాధవ్-సత్యభామలు కలుసుకున్నారా? అందుకోసం ఎదుర్కొన్న సమస్యలేమిటి? అనేది “షాదీ ముబాకర్” కథాంశం.
నటీనటుల పనితీరు: ఏళ్ల తరబడి సీరియల్స్ లో నటించిన సాగర్ కి ఈ చిత్రంలో కెమెరా ఫేస్ చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవడంతో మాధవ్ పాత్రలో ఎక్కడా తొణకలేదు. కామెడీ టైమింగ్ విషయంలో ఇంకాస్త ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది తప్పితే.. నటుడిగా సాగర్ లో పెద్దగా మైనస్ లు వెతకాల్సిన అవసరం లేదు. నటుడిగా మాధవ్ పాత్ర అతడి కెరీర్ కి హెల్ప్ అవుతుంది.
పలు మలయాళ చిత్రాల్లో నటించిన దృశ్య రంగనాధ్ ఈ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. సత్యభామ పాత్రలో ఒదిగిపోయింది ఈ మలయాళ కుట్టి. ఎమోషనల్ సీన్స్ లో కాస్త తేలిపోయింది కానీ.. ఓవరాల్ గా బాగా నటించడమే కాక సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచింది.
రాహుల్ రామకృష్ణ రోల్ చిన్నదే అయినప్పటికీ.. ఉన్న కాస్తలో బాగానే నవ్వించాడు. శత్రు, అజయ్ ఘోష్, అదితి మ్యాకల్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: శ్రీకాంత్ నారోజ్ సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. ఫస్టాఫ్ మొత్తం దాదాపుగా కారులోనే నడుస్తున్నప్పటికీ.. లొకేషన్స్ మినహా రిపీటెడ్ ఫ్రేమ్స్ లేకుండా జాగ్రత్తపడ్డాడు. అందువల్ల ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వలేదు. సునీల్ కశ్యప్ బాణీలు పర్వాలేదు అనేలా ఉండగా.. నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. ప్రొడక్షన్ డిజైన్ లో మాత్రం దిల్ రాజు మార్క్ కనిపించలేదు. కథకు అవసరమైనదానికంటే కూడా లో-బడ్జెట్ లో సినిమాను ముగించేశారు అనిపిస్తుంది. ఇంకాస్త ఖర్చుపెట్టి ఉంటే అవుట్ పుట్ ఇంకాస్త మెరుగ్గా ఉండేది.
దర్శకుడు పద్మశ్రీ చాలాసార్లు చూసిన కథనే కాస్త కొత్తగా చెప్పాడు. కథలో చిన్నపాటి లొసుగులున్నా.. కథనంలో వాటికి తావివ్వలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వచ్చే ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని డీసెంట్ ఎంటర్ టైనర్ గా “షాదీ ముబాకర్”ను మలిచాడు దర్శకుడు పద్మశ్రీ. అనవసరమైన ల్యాగులు లేకుండా, సింపుల్ హ్యూమర్, సెన్సిబుల్ ఎమోషన్స్ తో “షాదీ ముబారక్”ను తెరకెక్కించాడు డైరెక్టర్ పద్మశ్రీ.
విశ్లేషణ: ఒక సగటు ప్రేక్షకుడు కోరుకునే ఆరోగ్యకరమైన హాస్యం, అలరించే కథ, ఆకట్టుకునే కథనం వంటివన్నీ ఉన్న సినిమా “షాదీ ముబారక్”. ఇంకాస్త బాగా తీయడానికి స్కోప్ ఉన్నప్పటికీ.. బడ్జెట్ పరిమితుల దృష్ట్యా బాగానే తీసినట్లే. సొ, అంచనాలు, ఎక్స్ పెక్టేషన్స్ లాంటివి పెట్టుకోకుండా థియేటర్లో ఓ రెండు గంటలు సరదాగా ఎంజాయ్ చేయదగిన సినిమా “షాదీ ముబారక్”. ముబారక్ సాగర్ అలియాస్ ఆర్.కె.నాయుడు సాబ్ పెహ్లే హిట్ కేలియే!