దర్శకుడు శంకర్ మరియు ఆర్.నారాయణమూర్తిల వద్ద అసిస్టెంట్ గా వర్క్ చేసిన నరసింహారావు దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం “శరభ”. ఆకాష్ కుమార్ కథానాయకుడిగా పరిచయమైన ఈ చిత్రం ద్వారా జయప్రద తెలుగులో రీఎంట్రీ ఇవ్వడం విశేషం. గ్రాఫికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం చాన్నాళ్లపాటు విడుదలకు ఇబ్బందులు పడి ఎట్టకేలకు ఇవాళ (నవంబర్ 22) విడుదలైంది. మరి ఈ మైథలాజికల్ విజువల్ వండర్ జనాల్ని ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!
కథ : 18 శక్తి పీఠాల మీద పట్టు సాధించిన మహా మాంత్రికుడు చంద్రాక్షుడు సర్వశక్తులు సొంతం చేసుకోవాలంటే.. 18 మంది దివ్య కన్యలను బలి చేయాలి. 17 మందిని బలి చేసిన తర్వాత 18 కన్య కోసం వెతికే క్రమంలో మరణిస్తాడు. చంద్రాక్షుడి మరణం అనంతరం అతడి కుమారుడు (చంద్రదీప్) ఆ బాధ్యతను స్వీకరిస్తాడు.
కట్ చేస్తే.. సింగారిపురం అనే గ్రామంలో మామయ్య చిన్నారావు (నాజర్)తో కలిసి బలాదూర్ తిరుగుతుంటాడు శరభ (ఆకాష్ కుమార్). చంద్రాక్షుడి కుమారుడు వెతుకుతున్న 18వ దివ్యకన్య దివ్య (మిస్తీ చక్రవర్తి) అదే ఊరు వస్తుంది. మొదట్లో టామ్ & జెర్రీలా గొడవపడినా.. త్వరగానే రోమియో-జూలియట్ వలె అమర ప్రేమికులుగా మారిపోతారు. దివ్యను వెతుక్కుంటూ సింగారిపురం వచ్చిన దుష్టుడికి శరభ అడ్డంగా నిలుస్తాడు.
ఆ దుష్ట శక్తిని శరభ దైవ బలంతో కూడిన మానవశక్తితో ఎలా జయించాడు? అనేది “శరభ” కథాంశం.
నటీనటుల పనితీరు : హీరోగా ఇంట్రడ్యూస్ అయిన ఆకాష్ కుమార్ స్క్రీన్ ప్రెజన్స్ చాలా యావరేజ్ గా ఉన్నప్పటికీ.. యాక్షన్ మరియు ఎమోషనల్ సీన్ లో మాత్రం పర్వాలేదు అనిపించుకొన్నాడు. అయితే.. నటుడిగా కొనసాగాలి అనుకొంటే మాత్రం హావభావాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది.
“చిన్నదాన నీకోసం” ఫేమ్ మిస్తీ చక్రవర్తికి మంచి పాత్ర లభించింది కానీ.. నటనతో ఆకట్టుకోలేకపోయింది. సెకండాఫ్ లో పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్నప్పటికీ.. పెద్దగా మెప్పించలేకపోయింది.
చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించిన జయప్రద.. తన సీనియారిటీ మరోసారి నిరూపించుకొంది. సెంటిమెంట్ సీన్స్ లో ఆమె నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రత్యేక అతిధి పాత్రలో నెపోలియన్ ఆకట్టుకొన్నాడు. తాను ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగలను అని మరోమారు నిరూపించుకొన్నాడు.
సాంకేతికవర్గం పనితీరు : ముందుగా ఈ సినిమాకి 22 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు పెట్టించిన దర్శకుడు నరసింహారావు గురించి మాట్లాడుకోవాలి. ఒక కొత్త హీరోను ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు భీభత్సమైన సినిమా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేనప్పుడు ఇంత ఖర్చు పెట్టించడం అనేది చాలా పెద్ద నేరం. పైగా.. సినిమా కథ “ఢమరుకం”ను గుర్తుచేస్తే.. కథనం 90ల కాలంలో కోడి రామకృష్ణగారు తెరకెక్కించిన ఫాంటసీ సినిమాలను గుర్తుకుచేస్తుంది. శంకర్ దగ్గర చేసిన శిష్యరికం గ్రాఫిక్స్ & ఆర్ట్ వర్క్ లో మాత్రమే కనిపించింది. కథనం విషయంలో మాత్రం తన మరో గురువు అయిన ఆర్.నారాయణమూర్తి స్థాయి కూడా కనిపించలేదు. మొదటి 15 నిమిషాల్లోనే క్లైమాక్స్ ఏమిటనేది అర్ధమైపోయేలా కథనం రాసుకొన్న నరసిమహారావు.. సినిమాను అనవసరమైన సన్నివేశాలు, ఎలివేషన్స్ తో సాగదీసిన విధానం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.
కోటి సంగీతం సోసోగా ఉన్నా.. నేపధ్య సంగీతం సినిమాలోని కంటెంట్ కు తగ్గట్లు ఉంది. రమణ సాల్వ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొంటే బాగుండేది. గ్రాఫిక్స్ వర్క్, డి.ఐ మాత్రం ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేయడం ఖాయం. ఆర్ట్ వర్క్ లో ఒక్కటంటే ఒక్క మిస్టేక్ కూడా లేకపోవడం ప్రశంసనీయం.
విశ్లేషణ : కథ, కథనంతో సంబంధం లేకుండా అలరించే గ్రాఫిక్స్ మరియు కళా నైపుణ్యాన్ని ఎంజాయ్ చేసేవారు మాత్రమే ఈ సినిమా చూడొచ్చు. ట్రైలర్ లో గ్రాఫిక్స్ చూసి ఏదో ఎక్స్ పెక్ట్ చేసి థియేటర్ కి వెళ్తే మాత్రం దారుణంగా నిరాశ చెందుతారు.
రేటింగ్ : 1.5/5