సంచలన వ్యాఖ్యలకు, ముక్కుసూటితనానికి కేరాఫ్ అడ్రస్ సింగర్ చిన్మయి శ్రీపాద. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. పలు అంశాలపై తన అభిప్రాయాలను నిర్భయంగా పంచుకుంటారు. తాజాగా ఆమె ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సింగర్ కార్తీక్‌ను టార్గెట్ చేస్తూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌కు, సింగర్ కార్తీక్‌కు ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా ఇస్తారో నాకు అస్సలు అర్థం కావడం లేదని చిన్మయి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
“అలాంటి వాళ్లకు డబ్బు, అధికారం, పలుకుబడి కట్టబెట్టడం అంటే.. ‘ఇదిగో నా సపోర్ట్, వెళ్లి లైంగిక దాడులు చేసుకో’ అని చెప్పినట్లే అవుతుంది” అంటూ ఆమె ఘాటుగా విమర్శించారు. చివరగా, “ఒకవేళ కర్మ సిద్ధాంతం అనేది నిజంగా ఉంటే, అది వాళ్లను కచ్చితంగా వెంటాడి తీరుతుంది” అని ఆమె హెచ్చరించారు.గతంలో ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా ప్రముఖ తమిళ రచయిత వైరముత్తుపై చిన్మయి లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
దీంతో తమిళ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆమెపై నిషేధం కూడా విధించింది. ఇక జానీ మాస్టర్‌పై కూడా లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం, అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత అక్టోబర్ 24న బెయిల్‌పై బయటకు రావడం జరిగాయి.ప్రస్తుతం చిన్మయి చేసిన ఈ వ్యాఖ్యలపై జానీ మాస్టర్ గానీ, కార్తీక్ గానీ ఇంకా స్పందించలేదు. కాగా, రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోని ఓ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నట్లు సమాచారం.