ఇచ్చిన తక్కువ బడ్జెట్ తోనే “ఎవడే సుబ్రహ్మణ్యం” అని సినిమాని నాగ్ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సారి ఆయన అడిగినంత ఇవ్వడంతో అందమైన కళాఖండాన్ని వెండితెరపై ఆవిష్కరించారు. అలనాటి మహానటికి ప్రాణం పోశారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ తో కలిసి స్వప్న దత్ నిర్మించిన ఈ సినిమా మే 9న రిలీజ్ అయి అందరితో అభినందనలు అందుకుంది. సావిత్రిగా కీర్తి సురేష్ నటన అందరినీ ఆకట్టుకుంది. సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ మెప్పించారు. మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, క్రిష్, అవసరాల శ్రీనివాస్, విజయ్ దేవరకొండ వంటి అనేక మంది నటించిన ఈ సినిమాకి ముందుగా మంచి శాటిలైట్ ధరపలకలేదు.
అందుకే ఈ సినిమా హక్కులను రిలీజ్ కి ముందు ఎవరికీ ఇవ్వలేదు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని నిర్మాతలు అశ్వినీదత్, స్వప్న దత్, ప్రియాంక దత్ లు నమ్మకంగా ఉన్నారు. వారి నమ్మకం ఫలించింది. సినిమాకి వచ్చిన రెస్పాన్స్ తో అనేక ఛానల్స్ ఈ చిత్రాన్ని సొంతం చేసుకోవడానికి పోటీ పడ్డాయి. చివరగా జీ సంస్థ వాళ్ళు మహానటి అన్ని భాషల్లో కలుపుకొని శాటిలైట్ రైట్స్ కోసం 11 కోట్లు చెల్లించారని సమాచారం. ఇది సినిమా బడ్జెట్ లో సగభాగానికి సమానమని ట్రేడ్ వర్గాల వారు తెలిపారు. సో మహానటి వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైన వెలిగిపోనుంది.