విశ్లేషకులు మెచ్చుకుంటే కమర్షియల్ హిట్ లేకుంటే పీపుల్స్ హిట్టా?

  • September 15, 2018 / 01:37 PM IST

“రివ్యూ” ఈ పదం వింటేనే కొందరికి ఒకేసారి వంద వానపాములు ముఖం మీద నుంచి పాక్కుంటూ కిందకి వెళ్ళినట్లుంటుంది. అంత చిరాకు, కోపం ఎందుకో అర్ధం కాదు. ఈమధ్యకాలంలో పెయిడ్ రివ్యూస్ వచ్చి “రివ్యూ & రేటింగ్” వేల్యూ పడిపోయింది కానీ.. ఒకప్పుడు రివ్యూలకు దర్శకనిర్మాతలు విశేషమైన ప్రాముఖ్యత ఇచ్చేవారు, ఇక ఆ రివ్యూలను రాసేవారికైతే గొప్ప మర్యాద ఇచ్చేవారు. రానురాను జర్నలిజం విలువల్లానే రివ్యూ & రివ్యూ రైటర్స్ వేల్యూ కూడా పడిపోతు వచ్చింది. అయితే.. ఆ పడిపోతున్న వేల్యుస్ తో సంబంధం లేకుండా ఇప్పటికీ కొందరు రివ్యూ రైటర్లు సినిమాలను తమదైన శైలిలో అద్భుతంగా ఎనలైజ్ చేస్తూ.. దర్శకనిర్మాతలు చేస్తున్న తప్పులను వేలెత్తి చూపుతూనే.. బాగున్న విషయాలను మెచ్చుకొని ప్రోత్సహిస్తున్నారు.

అయితే.. మన హీరోహీరోయిన్లు, దర్శకనిర్మాతలకు అప్రిసియేషన్ ను తీసుకోవడంలో ఉన్న ఇంట్రెస్ట్ కానీ ఉత్సుకత కానీ ఎనాలిసిస్ ను సరిగా అర్ధం చేసుకోవడంలో చూపడం లేదు. “జైలవకుశ” టైమ్ లో ఎన్టీయార్, “ఈ నగరానికి ఏమైంది” టైమ్ లో తరుణ్ భాస్కర్, “నీవెవరో” టైమ్ లో ఆది పినిశెట్టి & కోనా వెంకట్ లు.. ఇక రీసెంట్ గా “శైలజారెడ్డి అల్లుడు” దర్శకుడు మారుతి కూడా రివ్యూలపై మండిపడుతున్నారు. సినిమా బాగా తీయలేదు అని వివరించినప్పుడు తిడుతూ సీరియస్ అయిపోతున్న ఈ సెలబ్రిటీలందరూ.. తమ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పుడే ఆ రివ్యూలతోనే సినిమాలను మార్కెట్ చేసుకొన్న సందర్భాలను ఎందుకు మర్చిపోతున్నారు.

రివ్యూ రైటర్లు ఆడియన్స్ మైండ్ సెట్ ను మార్చలేదు. అలా అనుకుంటే “సరైనోడు” సినిమాకి పాజిటివ్ రివ్యూస్ చాలా తక్కువగా వచ్చాయి అయినా కూడా సినిమా సూపర్ హిట్ అయ్యింది కదా. ఒక రివ్యూ అనేది సినిమాని ఎనలైజ్ చేసి.. ప్రేక్షకులు ఆ సినిమా నుంచి ఏం ఆశించవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తుంది. అంతే తప్ప ఆ సినిమాకి వెళ్ళకండి అని ఏ రివ్యూ కూడా పేర్కొనదు. ఇంత చిన్న విషయాన్ని పట్టించుకోకుండా ఎప్పుడు చూసినా రివ్యూలపై, రివ్యూ రైటర్లపై దుమ్మెత్తిపోస్తూ.. “మీరు తీయండి వచ్చి సినిమాలు” అంటూ అనవసర కామెంట్లు చేయడం అనేది సబబు కాదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus