యంగ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ భారతీయ జనతా పార్టీలో చేరారు. భాజపా తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. నిజానికి ఇటు రాజకీయంగా, అటు సినిమాల పరంగా అంతగా పేరు లేని శ్రష్టి వర్మ ఇప్పుడు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు అనేది ఓ ప్రశ్నగా మారింది. గతంలో ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌తో జరిగిన వివాదం ఈ నేపథ్యంలో బయటకు వచ్చింది. దానికీ దీనికీ ఏమన్నా సంబంధం ఉందా అనే ప్రశ్న మొదలైంది.
ఎందుకంటే జానీ మాస్టార్ ఈ విషయం జరిగే ముందు వరకు జనసేన పార్టీలో కీలకంగానే ఉండేవారు. అయితే ఆంధ్రప్రదేశ్ వరకే. కానీ పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉన్నారు. ఇక శ్రష్టి వర్మతో ఆమె వివాదం ఇప్పుడు వార్తల్లో లేదు కూడా. ఈ సమయంలో ఆమె రాజకీయాల్లోకి రావడం కీలకంగా మారింది. అందులోనూ ఆమె తెలుగమ్మాయి కాదు. ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన అమ్మాయి. ఈ విషయంలో త్వరలోనే అన్ని స్పష్టతలు వచ్చే అవకాశం ఉంది.
ఇక శ్రష్టి వర్మ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా పట్టణంలో పుట్టి పెరిగారు. 12వ తరగతి పూర్తి చేసిన ఆమెకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. స్కూల్ ప్రోగ్రామ్స్ డ్యాన్స్‌లు చేశాక.. ఆ తర్వాత ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత భరతనాట్యం నేర్చుకున్నారు శ్రష్టి. 8 ఏళ్ల వయసులో తాజ్ మహోత్సవ్ లాంటి జాతీయ ఈవెంట్లలో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత టీవీ రియాల్టీ షోల్లోకి వచ్చారు. ఆ తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా కొన్ని సినిమాలకు చేసి.. ఆ వెంటనే కొరియోగ్రాఫర్ అయ్యారు. ‘పుష్ప: ది రూల్’ సినిమాలోని ‘సూసేకి..’ పాట శ్రష్టికి పేరు తెచ్చి పెట్టింది. ‘బిగ్ బాస్ 9’లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో వచ్చారు.