తెలుగు సినిమా గమనంలో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఓ మలుపు. ఒక సాధారణ కథకు తనదైన స్క్రీన్ ప్లే జోడించి 70, 80ల్లోని ప్రేక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేశారు. ప్రయోగాల్లోనూ ఆయనది పైచేయే. ‘ఆదిత్య 369’ సినిమా ఆ కోవలోనిదే. పాతికేళ్ల క్రితమే ఈ ప్రయోగం చేశారంటే కాలంతో అయన పడుతోన్న పోటీని అర్థం చేసుకోవచ్చు. భైరవ ద్వీపం, పుష్పక విమానం, మైఖేల్ మదన కామరాజు లాంటి విభిన్న చిత్రాలు చేసిన సింగీతం వారు తాజాగా మరో సినిమా చేయనున్నట్టు సమాచారం.
ప్రముఖ జీవ రసాయన శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు జీవితం ఆధారంగా ఈ సినిమాని సింగీతం తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్టు తెలిపిన ఆయన అవి పూర్తయ్యాక నటీనటుల వివరాలు వెల్లడిస్తామన్నారు. ఆదిత్య 369 సీక్వెల్ తో బాలయ్య వందో సినిమా దర్శకుల జాబితాలో సింగీతం చేరినప్పటికీ బాలయ్య క్రిష్ తో చేతులు కలిపారు. మరోవైపు ఆయన తర్వాతి సినిమాలకి కృష్ణవంశీ లాంటి దర్శకులు రెడీగా ఉన్నారు. ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కువుతుందన్నది కాలమే నిర్ణయించాలి. చివరిగా సరోగసి కథాంశంతో ‘వెల్కమ్ ఒబామా’ సినిమా చేసిన సింగీతం గతంలో ప్రముఖ నర్తకి ‘మయూరి’ కథతో సినిమా చేసిన సంగతి తెలిసిందే.