ఇటీవల సెలబ్రిటీల పేర్లను అడ్డంపెట్టుకుని సినీ ఇండస్ట్రీలో మోసాలు చేస్తున్న వారి సంఖ్య ఎక్కువవుతుంది. ఈమధ్యనే ‘ఆర్.ఎక్స్.100’ దర్శకుడు అజయ్ భూపతి వంటి వాళ్ళు కూడా ఈ విషయమై స్పందించి అందరూ ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి అంటూ హెచ్చరించారు . తాజాగా సింగర్ సునీత పేరుని ఉపయోగించి కూడా ఓ వ్యక్తి చీటింగ్ కు పాల్పడినట్టు సమాచారం. చైతన్య అనే ఓ వ్యక్తి సింగర్ సునీతకు మేనల్లుడిని అని చెప్పి.. కొందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడట.
ఈ విషయం తెలుసుకున్న సునీత వెంటనే రియాక్ట్ అయ్యారు. ఓ వీడియో ద్వారా ఆమె మాట్లాడుతూ.. “నేను అందరికీ ఒక విషయం పై క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. చైతన్య అనే వ్యక్తి.. నా మేనల్లుడు అని చెప్పుకుని.. సెలబ్రిటీలతో పరిచయాలు పెంచుకుంటున్నాడట. అవకాశాలు ఇప్పిస్తానంటూ కొందరి దగ్గర డబ్బులు కూడా తీసుకుంటున్నాడని నాకు తెలిసింది. ఇది విన్న వెంటనే నేను షాక్ అయ్యాను. నాకు చైతన్య అనే మేనల్లుడు లేడు. దయచేసి ఇకపై ఎవ్వరూ మోసపోకండి.
మోసపోకూడదనే ఇలా వీడియో ద్వారా ఈ విషయాన్ని చెబుతున్నాను. ప్రతి రోజూ ఇలా ఇండస్ట్రీలో మోసాలు గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినా.. ఎలా మోసపోతున్నారు.? సెలబ్రిటీకి చుట్టం అనగానే ఎందుకు వారికి డబ్బులిచ్చి మోసపోతున్నారు. కొంచమైనా ఆలోచించరా? ఇకపై బయటి వ్యక్తులు ఎవరైనా ఇలా చెబితే కాస్త ఆలోచించండి. డబ్బులు పోగోట్టుకోవద్దు. ఆ చైతన్య అనే వ్యక్తి ఎవరో నాకు తెలీదు.కానీ అతన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు.” అంటూ చెప్పుకొచ్చింది సునీత.