SKN: సినిమా కష్టం నిర్మాతది.. పాప్ కార్న్ లాభం మల్టీప్లెక్స్‌ది! SKN లెక్కలు

థియేటర్లో సినిమా చూడ్డానికి మనం వేలల్లో ఖర్చు పెడుతుంటాం. టికెట్ రేట్లు పెరిగాయని, స్నాక్స్ రేట్లు మండిపోతున్నాయని తిట్టుకుంటూనే జేబులు ఖాళీ చేసుకుంటాం. అయితే మనం ఖర్చు పెట్టే ఈ డబ్బులో సినిమా తీసిన నిర్మాతకు ఎంత వెళ్తుందో తెలుసా? అక్షరాలా పదిహేడు శాతం మాత్రమే. ఈ చేదు నిజాన్ని ప్రముఖ నిర్మాత SKN (శ్రీనివాస కుమార్) సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు. మల్టీప్లెక్స్ దోపిడీ వ్యవస్థలో అసలు నిర్మాత పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వివరిస్తూ ఆయన షేర్ చేసిన ఒక చార్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

SKN

SKN బయటపెట్టిన లెక్కల ప్రకారం.. ఒక నలుగురు సభ్యులున్న కుటుంబం మల్టీప్లెక్స్‌కు వెళ్లి సినిమా చూస్తే సగటున రూ. 2178 ఖర్చు అవుతుంది. ఇందులో టికెట్లు, ఇంటర్వెల్ స్నాక్స్ అన్నీ కలిపి ఉంటాయి. షాకింగ్ విషయం ఏంటంటే.. ఇందులో అత్యధికంగా అంటే దాదాపు 71 శాతం (రూ. 1545) మల్టీప్లెక్స్ యాజమాన్యానికే వెళ్తోంది. ఇక గవర్నమెంట్ ట్యాక్సులు, ఆన్‌లైన్ బుకింగ్ చార్జీలు పోను, కోట్లు అప్పు చేసి సినిమా తీసిన నిర్మాత చేతికి వచ్చేది మాత్రం కేవలం 17 శాతం (రూ. 372) మాత్రమేనట.

ఇక్కడ అసలైన మ్యాజిక్ ఎక్కడ జరుగుతోందంటే ‘ఫుడ్ అండ్ బెవరేజెస్’ దగ్గర. మనం కొనే పాప్ కార్న్, సమోసా, కూల్ డ్రింక్స్ ద్వారా వచ్చే రూ. 1200లో నిర్మాతకు ఒక్క రూపాయి కూడా రాదు. అది మొత్తం థియేటర్ వాళ్ళ జేబులోకే వెళ్తుంది. అంటే కష్టపడి కథ రెడీ చేసి, హీరోని ఒప్పించి, సినిమా తీసి రిస్క్ చేసేది నిర్మాత అయితే.. కేవలం ఏసీలు వేసి, స్నాక్స్ అమ్ముకుని కోట్లు గడిస్తోంది మాత్రం మల్టీప్లెక్స్ వాళ్ళే అని ఈ గణాంకాలు స్పష్టంస్తున్నాయి.

ఈ ట్వీట్ చూసిన ఒక నెటిజన్ “మరి హీరోలకు బ్లాక్ మనీ రూపంలో ఇచ్చే రెమ్యునరేషన్ల మాటేంటి?” అని ప్రశ్నించగా, SKN దానికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. “ఆ రోజులు పోయాయి సామీ.. ఇప్పుడు అంతా వైట్ మనీనే” అని తేల్చి చెప్పారు. ఓటీటీ, శాటిలైట్, ఆన్‌లైన్ బుకింగ్ సిస్టమ్స్ వచ్చాక ప్రతి రూపాయికి లెక్క ఉంటోందని, జీఎస్టీ పరిధిలోకి అన్నీ వచ్చేశాయని, పాత కాలపు నాలెడ్జ్‌తో మాట్లాడొద్దని క్లారిటీ ఇచ్చారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus