ఒకరికి మహేశ్.. మరొకరికి మెగాహీరో..!

నిర్మాతలుగా పరిశ్రమలో అప్పుడప్పుడే అడుగుపెడుతున్న వారిలో చాలామంది స్టార్ హీరోలు, దర్శకులతో సినిమాలు చేయాలని తాపత్రయపడుతుంటారు. దానికి వ్యాపారపరమైన కారణాలు ఉన్నాయి మరి. కడకు నిర్మాతకు కావాల్సింది లాభమే. సినిమా విషయంలో ఎప్పుడు కాసుల వర్షం కురుస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఓ మామూలు హీరోతోనో లేక మీడియం రేంజ్ హీరోతోనో సినిమాలు చేస్తే హిట్ టాక్ వస్తే గానీ ప్రేక్షకులు థియేటర్ గుమ్మం తొక్కని రోజులివి. ఒకవేళ మొదటివారంలో హిట్ అని నిరూపించబడినా తర్వాతి వారంలో ఓ అగ్ర హీరో సినిమా వచ్చిందే అనుకోండి.. పెట్టింది కూడా రాబట్టుకోవడం కష్టం. అదే ఓ అగ్ర హీరోతో సినిమా చేస్తే ఓపెనింగ్ షో నుండే కలెక్షన్లు మొదలవుతాయి. సినిమా ఫలితం కొంత అటుఇటైనా మరీ అంత నష్టం వచ్చే ప్రమాదం ఉండదు.

ఈ కారణం వలనో ఏమో గానీ ఓ ఇద్దరు నిర్మాతలు ఇద్దరు అగ్ర హీరోలతో సినిమా చేయాలని ఉందంటూ సదరు హీరోలకు సంకేతాలు ఇస్తున్నారు. అందులో ఒకరు కెకె రాధామోహన్. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై ‘అధినేత’, ‘ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్ టైగర్’ వంటి చిత్రాలను నిర్మించిన రాధామోహన్ గోపీచంద్, నితిన్, నాగశౌర్య వంటి హీరోలతో సినిమాలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. మహేశ్ బాబుతో సినిమా చేయాలన్నది రాధామోహన్ గారి కోరికట. మహేశ్ కోసం ఇప్పటికే ఎంతోమంది నిర్మాతలు లైన్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మహేశ్ రాధామోహన్ గారి కోరిక మన్నించడం మామూలు విషయం కాదు. ఇదిలా ఉంటే ఈయన నిర్మించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఈ నెలలో తెరమీదికి రానుంది.

రాధామోహన్ మహేశ్ మీద మనసుపడగా సూర్య హీరోగా వచ్చిన అనువాద చిత్రం ‘రాక్షసుడు’, మరికొన్ని అనువాద సినిమాలను తెలుగు ప్రేక్షకుల వద్దకు తెచ్చిన మిరియాల రవీందర్ రెడ్డి ఏకంగా మెగా కాంపౌండ్ పైనే కన్నేశారు. కుటుంబ అంతా కృష్ణ అభిమానులే అని చెప్పుకొచ్చిన ఈ నిర్మాత రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో..? అన్నట్టు నాగచైతన్య నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాని తెలుగు వారికి అందిస్తున్నాయి ఈయనే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus