తారా ప్రపంచంలో…తారక్ ప్రయాణం!!!

  • May 20, 2020 / 11:13 AM IST

“ఎన్టీఆర్” ఈ మూడు అక్షరాలే ప్రభంజనం…కొన్ని కోట్ల ఆంధ్రుల గుండె చప్పుడు. అయితే ఆయన వారసుడిగా జన్మించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తాత గురించి చెప్పిన కొన్ని ముచ్చట్లపై ఒక లుక్ వేద్దాం రండి…33వ పుట్టిన రోజు జరుపుకున్న ఎన్టీఆర్, దాదాపుగా 25సినిమాలు హీరోగా పూర్తి చేశాడు. కొన్ని కోట్ల మంది అభిమానుల గుండె చప్పుడుగా మారిపోయాడు. మాస్ ఫాలోయింగ్ విషయంలో ఎవరెన్ని మాటలు చెప్పినా ఎన్టీఆర్ తరువాతే ఎవరైన అన్నంత మాస్ అభిమానులను సంపాదించుకున్నాడు.

అయితే అలాంటి ఎన్టీఆర్, తన 17 ఏళ్ల కరియర్ లో ఎన్నో ఆటుపోట్లకు గురయ్యాడు….పడిపోయిన కెరటం మళ్ళీ లేస్తుంది అన్నది ఎంత నిజమో, పరాభవం ఎదురైనప్పుడల్లా, ఎన్టీఆర్ పడి లేచిన కెరటంలా దూసుకుపోతున్నాడు…ఇంతకీ ఎన్టీఆర్ కు బలం ఎవరు? ఆయన్ని నడిపిస్తున్న శక్తి ఎవరు అంటే….రండి ఆయన మాటల్లోనే విందాం…తాత గారే పేరే నాకు శ్రీరామ రక్ష…తారక మంత్రమే నాకు సర్వజగద్రక్ష అంటున్నాడు యంగ్ టైగర్… ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలతో తాతగారు తన తలరాతను మార్చేసారు అంటున్నాడు మన బుడ్డోడు. ఆయన పేరు, ఆయన రూపం, ఆయన అభిమాన సంద్రం వెరసి, తనని స్టార్ హీరోగా నిలిపాయి అంటున్నాడు తారక్.

నా తొలి గురువు ‘అమ్మ’చిన్న నాటి నుంచే స్కూలూ, క్రికెట్టూ, ఫ్రెండ్స్‌తో గొడవలూ, సినిమాలూ..షికార్లూ ఇలా ఒక్కటి కాదు, మనం చెయ్యని అల్లరి లేదు. అయితే అల్లరి చేసినప్పుడల్లా అమ్మ చేతిలో దెబ్బలు తినేవాణ్ణి. చేతికి ఏది దొరికితే దాంతో కొట్టేసేది. ఒక్కోసారి బెల్ట్ తెగేవరకూ కొట్టిన సంధర్భాలు ఉన్నాయి. అయితే అంత కోపంగా నన్ను దండించినా…కొంతసేపయ్యాక.. ఒంటికి మందు రాసి, భోరున ఏడ్చేసేది. ఎందుకంటే నేనంటే అంత ప్రాణం మా అమ్మకు. కోపంలో శివతాండవం చేసినా…ప్రేమతో దగ్గరకు తీసుకునేది. అలా వాస్తవంలో బతకడం నాకు అమ్మే నేర్పింది. జీవితంలో ఏదో ఒకటి చెయ్‌.. నిరూపించుకో.. లేదంటే మనుగడ కష్టం’ అంటూ నా తొలి గురువుగా మారి, నాలోని ఆత్మవిశ్వాసానికి పెరగడానికి ముఖ్య కారణం అయ్యింది.

తాతయ్య పిలుపు…ప్రాణం పోసింది!తాతయ్యకు దూరంగా ఉంటున్న సమయంలో తాతయ్య నిన్ను చూడలట అన్న పిలుపు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. తాతయ్య ఇంటికి మొదటి సారి ‘తారక్‌ రామ్‌’ గా వెళ్ళిన నేను, ఆయన పుణ్యమా అని, తారక రామారావుగా మారిపోయాను. ఆయన గంభీర్యాం చూస్తే కొంచెం భయం అనిపించింది, అదే క్రమంలో ఆశ్చర్యం కలిగింది, నాకు తెలియకుండానే ఆనందంతో మది మురిసిపోయింది. ‘మేజర్‌ చంద్రకాంత్‌’ షూటింగ్‌ సమయంలో నాకు మేక్ అప్ వేయించి ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రాన్ని హిందీలోకి తీస్తున్నాం. అందులో భరతుడు మీరే’ అన్నారు. అంతకన్నా ఏం కావాలి, పట్టరాని సంతోషంతో మనసు ఊగిపోయింది. అలా ఆయనే నా తొలి దర్శకుడుగా నాకు నటనలో ఓనమాలు నేర్పించారు. ఇక ఆ తరువాత ఆయన పేరే తారక మంత్రంగా ఎక్కడా శిక్షణ తీసుకోకుండా ఆయన్నే గురువుగా తలచుకుంటూ ముందుకు సాగిపోయా.

బాల’రామాయణం’ గొప్ప అనుభవం!నటనకు అర్ధం తెలియని వయసు, కెమెరా అంటే ఎంతో సరిగ్గా అర్ధం చేసుకోలేని వయసులో బాల రామాయణం చేశాను, ఆ అనుభవం చాలా మంచి అనుభూతిని ఇచ్చింది. అయితే ఆ సినిమాను ఒక్క మాటలో చెప్పాలి అంటే పిల్లలతో తీర్చిదిద్దిన ఓ అద్భుతం అని చెప్పగలను.

‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ రిలీజ్‌ రోజున టికెట్లు దొరకలేదు!బాబాయి సినిమా సంధ్య థియేటర్ లో రిలీజ్‌ రోజున చూసేందుకు వెళ్ళాను.. టికెట్లు దొరకలేదు. నాకే టిక్కెట్ ఇవ్వవా అన్న కోపంతో మేనేజర్‌తో గొడవ పెట్టుకున్నా. సినిమా చూస్తేగానీ ఇంటికి రానని చెప్పేశా. దాంతో నాన్నగారు ఫోన్‌ చేసి.. ‘వాడికో కుర్చీ వేసి చూపించండి’ అన్నారు. దాంతో ప్రత్యేకంగా ఓ కుర్చీ తీసుకొచ్చారు. మరోసారి టికెట్లు లేక ప్రొజెక్టర్‌ రూమ్‌లో కూర్చుని సినిమా చూశా.

తొలి పారితోషకం ఎంత అంటే!తొలి సారి హీరోగా చేసిన ‘నిన్ను చూడాలని’ సినిమాకు ఉషాకిరణ్‌ మూవీస్‌ వారు తొలి పారితోషికంగా రూ.3.5 లక్షలు నా చేతుల్లో పెట్టారు. అన్ని డబ్బులు ఒకేసారి చూడటం అదే మొదటి సారి. ఇంటికెళ్లి తలుపులేసుకొని లెక్కపెట్టాను. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు.. నెల రోజులూ అదే పని. ఇంట్లో మూల మూలల్లో దాచేవాడ్ని. అందులోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదనుకొన్నా. ఎవరైనా కాజేస్తారేమో అనే భయం కూడా వేసేది. అలా దాచీ దాచీ చివరికి మా అమ్మ చేతుల్లో పెట్టేశా… ఎంత సంపాదించినా తన కోసమే కదా అనిపించింది.

ఆ క్షణాలు ఇంకా గుర్తున్నాయి!2009 మార్చి 26న జరిగిన కారు ప్రమాదం నా ఆలోచనల్ని పూర్తిగా మార్చేసింది. ఆ క్షణాలు ఇంకా గుర్తు.. కన్నుమూసి తెరిచేలోగా ప్రమాదం జరిగిపోయింది. ఎక్కడెక్కడ ఎన్ని ఎముకలు విరిగాయో నాకే స్పష్టంగా తెలిసిపోయింది. ఒళ్లంతా రక్తం. సూర్యాపేట ఆసుపత్రికి వెళ్తుంటే.. నా జీవితమంతా కళ్ల ముందు కదిలింది. నా సినిమాలు, అమ్మ, అభిమానులు, నా వస్తువులు, చివరికి నేను పెంచుకుంటున్న కుక్కపిల్ల.. అన్నీ! ‘ఏంటి? జీవితం అయిపోయిందా?’ అనిపించింది. చచ్చిపోతానన్న భయం లేదు గానీ… ‘సాధించాల్సింది ఇంకా ఉంది కదా’ అనిపించింది.
అమ్మ దీవెనలు, అభిమానుల ఆశీర్వాదం, తాతయ్య ఆశీస్సులతో బతికి బట్టకట్టగలిగా.ఆ రోజు రెండోసారి పుట్టినట్లుగా అనిపించింది. ఇక ప్రణతి పుట్టిందీ అదే రోజు. అందుకే ప్రతీ ఏడాదీ మా ఇంట్లో మార్చి 26న రెండు పుట్టిన రోజులు జరుగుతాయి. ఆ ప్రమాదం నన్ను చాలా మార్చింది.. చాలా కూల్‌ అయ్యా. జీవితంపై దృక్పథం మారింది. బాధలో ఉన్నప్పుడు కూడా నవ్వడం నేర్చుకున్నా.

‘ప్రణతి’కి అన్నీ చెప్పేశా!సినీ పరిశ్రమలో రకరకాల పుకార్లు.. నాపై కూడా కొన్ని వచ్చాయి. వాటన్నింటి గురించీ క్లియర్‌గా తనకు చెప్పేశా. ‘నా పరిస్థితి ఇది, నా చుట్టూ ఇలాంటి మనుషులు ఉంటారు..’ అంటూ అన్నీ పూసగుచ్చినట్టు వివరించా. అందుకే మా ఇద్దరి మధ్యా ఎప్పుడూ ఎలాంటి సందేహాలూ, అనుమానాలూ చోటు చేసుకోలేదు.

నేను నమ్మే ఫిలాసొఫీ!నా సిద్ధాంతం కొత్తగా వింతగా ఉంటుంది. ‘ఇదేంటి ఎన్టీఆర్‌ ఇలాక్కూడా ఆలోచిస్తాడా’ అనిపిస్తుంది.
మా అమ్మ పడుకునేటప్పుడు ‘పొద్దుట టిఫిన్‌ ఏం చేయను’ అని అడిగేది.‘పొద్దున్న లేవాలి కదమ్మా.. ఎవరికి తెలుసు..? ఇదే చివరి నిద్రేమో’ అనేవాడ్ని. నా ఆలోచనలు అలా ఉంటాయి. ‘ఆశ’ అనే ఓ చిన్న రేఖపై బతుకుతున్నాం మనం. ఏమో.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఈ చిన్న జీవితంలో ఇన్ని గొడవలెందుకు? అనిపిస్తుంది. సింపుల్‌గా ఉండడం నాకిష్టం. మనసులో ఒకటి.. బయటకు మరొకటి చేతకాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తా. కుటుంబం అంటే ప్రాణం. సినిమాలకంటే నాకు నా కుటుంబమే ముఖ్యం. అందుకే.. బయట ఎక్కువగా కనిపించను.

పండగొస్తే, నాలుగు రోజులు షూటింగ్‌ లేకపోతే ఇంట్లోనే మకాం. అందరం కలిసి పాత సినిమాలు చూస్తాం. తాతయ్య సినిమాల్ని అస్సలు వదలను. నటుడిగా, వ్యక్తిగా, రాజకీయ నేతగా నాకు ఆయనే ఆదర్శం. నా అభిమాన కథానాయకుడూ… ఆయనే.

చివరిగాఎన్టీఆర్ అన్న పేరే నా ఊపిరి…నా ధైర్యం…ఏం సాధించినా. ఎంత సంపాదించినా.. ఏం కోల్పోయినా…చివరికి నాతో ఎప్పటికీ నిలిచిపోయే అపురూపమైన ఆస్తి ఆ మూడు అక్షరాలు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus