సుహాస్ (Suhas) పేరు చెప్పగానే ‘కలర్ ఫోటో’ (Colour Photo) ‘అంబాజీపేట’ (Ambajipeta Marriage Band) , కార్తీక్ రత్నం (Karthik Rathnam) పేరు చెప్పగానే ‘కేరాఫ్ కంచెరపాలెం’, విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) పేరు చెప్పగానే ‘బేబీ’ (Baby) … వంటి మంచి సినిమాలు గుర్తొస్తాయి. మరి ఈ ముగ్గురి కాంబినేషన్లో ఓ సినిమా వస్తుంది అంటే కచ్చితంగా అది ప్రామిసింగ్ గా ఉంటుంది అనే భావన అందరికీ కలుగుతుంది. సరిగ్గా ‘శ్రీరంగనీతులు’ (Sriranga Neethulu) పై కూడా అలాంటి అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలను మ్యాచ్ చేసిందో లేదో ఓ లుక్కేద్దాం రండి :
కథ : ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఇది ఒక ఆంథాలజీ డ్రామా. బస్తీ కుర్రాడు అయిన సుహాస్, కొడుకు పాత్ర చేసిన కార్తీక్ రత్నం, లవర్ పాత్ర పోషించిన విరాజ్ అశ్విన్.. ఈ 3 పాత్రలకి మూడు విభిన్నమైన కథల ద్వారా ఈ సినిమా రూపొందింది. ముందుగా బస్తీ కుర్రాడు అయిన సుహాస్.. స్కూల్ గ్రౌండ్స్ లో తన ఫ్లెక్సీ పెట్టుకుంటాడు.కానీ ఎవరో దాన్ని తీసేస్తారు. ఇంకో ఫ్లెక్సీ వేయించుకోవాలంటే అతని వద్ద డబ్బులు ఉండవు.
కొత్త ఫ్లెక్సీ వేయించుకోవడానికి అతను ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేది ఇతని కథ. ఇక డ్రగ్స్ కి బానిసైపోయిన కొడుకుగా కార్తీక్ రత్నంని అతని తండ్రి(దేవి ప్రసాద్) ఎలా బాగుచేసుకున్నాడు? అనేది రెండో కథ. ఇక మూడోది విరాజ్ అశ్విన్,రుహానీ శర్మ (Ruhani Sharma) ..ల ప్రేమ కథ. ఈ 3 కథలకి లింకేంటి? అవి కలిశాయా? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: సుహాస్ ఇప్పటికే చాలా రకాల పాత్రలు చేశాడు. ఇందులో చేసిన పాత్ర అతనికి ఛాలెంజింగ్ గా ఏమీ ఉండదు. అందుకే చాలా ఈజ్ తో చేశాడు. కాకపోతే మరీ ఒక్కటే ఎక్స్ప్రెషన్స్ తో కానిచ్చేస్తే తర్వాత ఇబ్బంది పడాల్సి రావచ్చు. కార్తీక్ రత్నం మంచి నటుడే. కానీ అతనికి ఇంకా సరైన పాత్ర పడట్లేదు. ఇందులో చేసిన పాత్ర కూడా సో సో గానే ఉంటుంది. తనవరకు అయితే కొంత వరకు న్యాయం చేశాడు కార్తీక్ రత్నం.
ఇక విరాజ్ అశ్విన్ కూడా రొటీన్ రోల్స్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. కాకపోతే రుహానీ శర్మతో అతని ట్రాక్ బాగా వర్కౌట్ అయ్యింది అని చెప్పవచ్చు. దేవీ ప్రసాద్ తన మార్క్ నటనతో ఓకే అనిపించుకున్నాడు. మిగిలిన నటీనటుల పాత్రలు పెద్దగా రిజిస్టర్ కావు అనే చెప్పాలి.
సాంకేతిక నిపుణుల పనితీరు: ఆంథాలజీ డ్రామాలు ఎందుకో తెలుగులో వర్కౌట్ కావడం లేదు. గతంలో వచ్చిన ‘వేదం’ ‘మనమంతా’ వంటి సినిమాలు కూడా క్రిటిక్స్ ను మెప్పించాయి. కానీ ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించడంలో విఫలమయ్యాయి. ఈ ఫార్మాట్ లో ఇంకా చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఫలితాల్లో మార్పు లేదు. ఓటీటీల్లో చూడడానికి ఇలాంటివి బాగానే ఉంటాయి. ‘శ్రీరంగనీతులు’ కూడా అంతే.! నీతులను థియేటర్స్ లో చూపిస్తే ఇన్స్పైర్ అవ్వడానికి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
ప్రవీణ్ కుమార్ వి.ఎస్.ఎస్ వంటి కొత్త దర్శకులు దీనిని గమనించాలి. ‘శ్రీరంగనీతులు’ విషయంలో స్క్రీన్ ప్లే తో అతను మ్యాజిక్ చేయలేదు అంటే కారణం అదే. మొత్తం సినిమాలో ఒకటి, రెండు మంచి సీన్స్ ఉన్నాయి. కాన్సెప్ట్ బాగున్నా…. కథనం స్లోగా ఉండటం మైనస్ గా చెప్పాలి. నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫీ వంటివి ఓకే. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి.
విశ్లేషణ: ‘శ్రీరంగనీతులు’…. ఓటీటీకి వెబ్ సిరీస్…గానో, యూట్యూబ్ లో షార్ట్ ఫిలింగానో తీసుంటే బాగుండేదేమో… కానీ థియేటర్లలో చూడటానికి చాలా కష్టపడాలి.
రేటింగ్ : 1.75/5