బంగ్లాదేశ్ సినీ ఇండస్ట్రీలో కూడా మాదక ద్రవ్యాల కేసు మరోసారి సంచలనంగా మారింది. ఆ దేశానికి చెందిన ఒక స్టార్ హీరోయిన్ ఏకంగా ఇంట్లోనే డ్రగ్స్ దాచుకొని మరి దందా నిర్వహిస్తోందని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఒక్కసారిగా కలకలం సృష్టించిన ఈ కేసులో ఇంకా మరేవారైనా నటీనటులు సినీ ప్రముఖులు ఉన్నారేమో అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే ప్రముఖ బంగ్లాదేశ్ నటి పోరి మోనిని బంగ్లాదేశ్ రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (RAB) అకస్మాత్తుగా అదుపులోకి తీసుకుంది.
ఆమెను అరెస్ట్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే గత కొన్ని వారాల క్రితమే ఆమె ఒక రాజకీయ నేతపై కూడా ఆరోపణలు చేశారు. జూన్ 8 న బోట్ క్లబ్లో అత్యాచారం చేసి చంపేందుకు కొంతమంది ప్రయత్నాలు చేసినట్టు పోరి మోని ఆరోపించింది. బోట్ క్లబ్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు నాసిర్ ఉద్దీన్ మహమూద్ ఆ దాడి వెనుక ముఖ్యమైన సూత్రధారి అని కూడా ఆమె తెలియజేసింది.
ఇక ఇంతలో ఢాకాలోని బనానీలో పోరి మోని ఇంటిపై అధికారులు నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించారు. అయితే ఆమె ఇంట్లో డ్రగ్స్ కు సంబంధించిన బాటిల్స్ చాలానే దొరికినట్లు రాపిడ్ యాక్షన్ లీగల్ అండ్ మీడియా వింగ్ డైరెక్టర్ కమాండర్ ఖండకర్ అల్ మొయిన్ వివరణ ఇచ్చారు. అయితే ఇది కావాలని చేసిన కుట్ర అని పోరి మోనీ సన్నిహితులు ఆరోపిస్తున్నారు.