తెలుగు టెలివిజన్, సినిమా ఈవెంట్లలో యాంకర్ సుమ కనకాల ఎనర్జీ గురించి, ఆమె టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా ట్రోలింగ్‌కు ఏ మాత్రం ఆస్కారం ఇవ్వకుండా, ఈవెంట్లను తనదైన శైలిలో నడిపించడంలో ఆమె దిట్ట. అయితే, ఆమె ప్రొఫెషనల్ లైఫ్ ఎంత పర్‌ఫెక్ట్‌గా సాగుతుందో, ఆమె పర్సనల్ లైఫ్‌పై, ముఖ్యంగా భర్త రాజీవ్ కనకాలతో ఆమె బంధంపై అన్ని రూమర్లూ నడుస్తాయి. ఈ 25 ఏళ్ల బంధంపై ఏళ్ల తరబడి “విడాకులు” అనే ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ పుకార్లపై సుమ ఎంత స్పష్టత ఇచ్చినా, అవి మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి.
Suma Kanakala
ఈ నిరంతర ప్రచారానికి సుమ రీసెంట్ పాడ్‌కాస్ట్‌లో ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. “మేము ఎప్పుడూ విడిపోలేదు. ప్రతి బంధంలో ఉన్నట్లే మా మధ్య కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి, పోతాయి” అని క్లారిటీ ఇచ్చారు. అంతటితో ఆగకుండా, ఈ రూమర్స్‌పై కొందరు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారో కూడా ఆమె బయటపెట్టారు. “మేమిద్దరం కలిసి వీడియోలు పెట్టినా, కింద ‘ఏంటి వీళ్లు ఇంకా విడిపోలేదా?’ అని కామెంట్స్ పెడతారు” అని సుమ ఆవేదన వ్యక్తం చేశారు.
బయట కొందరు వాళ్లు విడిపోయారని ప్రచారం చేస్తుంటే, వారిద్దరి మధ్య ఉన్న బంధం ఎంత బలంగా ఉందో సుమ చెప్పిన మరో సంఘటన వింటే అర్థమవుతుంది. సుమకు ఒక సెంటిమెంట్ ఉందట. తనకు కలలో ఏది వస్తే, అది నిజ జీవితంలో జరుగుతుందని ఆమె బలంగా నమ్ముతారు. మామూలుగా గుడికి వెళ్లినట్లు కల వస్తే, మరుసటి రోజే వెళ్లడం లాంటివి జరిగేవట. అయితే, ఈ నమ్మకం, వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎంత లోతైనదో చెప్పడానికి ఒక ఉదాహరణ కూడా ఆమె పంచుకున్నారు.
ఒకసారి రాజీవ్ కనకాలకు యాక్సిడెంట్ అయినట్లు సుమకు కలలో వచ్చిందట. ఆ సమయంలో రాజీవ్ షూటింగ్‌లో ఉన్నారు. కంగారుపడిన సుమ వెంటనే ఫోన్ చేసినా ఆయన తీయలేదు. కీడు శంకిస్తున్న సమయంలో రాజీవ్ తిరిగి కాల్ చేసి, “అవును సుమ, నువ్వు నమ్ముతావో లేదో.. నిజంగానే యాక్సిడెంట్ అయింది. నా కారు చెట్టుకు గుద్దుకుంది” అని చెప్పారు.
ఆ మాట వినగానే సుమ వెంటనే లొకేషన్‌కు వెళ్లి, రాజీవ్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లి కట్టు కట్టించారట. ఈ ఒక్క సంఘటన చాలు, విడాకులంటూ ప్రచారం చేసేవారికి వారి మధ్య ఉన్న అనుబంధం ఏంటో చెప్పడానికి. కలలో భర్తకు జరగబోయే ప్రమాదాన్ని కూడా పసిగట్టేంత బలంగా వారి బంధం ఉందన్నమాట అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.