గదర్ 2 (Gadar 2) విజయంతో మరొకసారి బ్లాక్‌బస్టర్ బాటలోకి వచ్చిన సీనియర్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol) , ఇప్పుడు ఓటీటీ వైపు మొగ్గు చూపడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. రూ.500 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చిన ‘జాట్’ (Jaat) సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కోసం సన్నీ చేస్తున్న కొత్త యాక్షన్ డ్రామా సినిమాపై ప్రేక్షకుల దృష్టి ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను సిద్ధార్థ్ పి మల్హోత్రా డైరెక్ట్ చేయనుండగా, 2007లో విడుదలైన హాలీవుడ్ మూవీ ‘డెత్ సెంటేన్స్’ ఆధారంగా తెరకెక్కించనున్నారు.
స్క్రిప్ట్‌ను సుపర్ణ్ వర్మ హిందీలో అడాప్ట్ చేస్తున్నారు. షూటింగ్ జూలై 2025లో ప్రారంభమవ్వనుండగా, రిలీజ్ మాత్రం 2026లో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది. అయితే, థియేటర్స్‌కి అలవాటైన సన్నీ అభిమానులు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు మళ్లిన ఈ ప్రయత్నాన్ని ఎంతగానూ అంగీకరిస్తారన్నది ప్రశ్నగా మారింది. ఇటీవల సల్మాన్ ఖాన్ (Salman Khan), అక్షయ్ కుమార్ (Akshay Kumar) లాంటి సీనియర్ హీరోలు యాక్షన్ జానర్ నుంచి దూరమవుతున్న తరుణంలో సన్నీ మళ్లీ అదే బాటలో నడవడం రిస్క్‌గానే భావిస్తున్నారు.
ఇక గదర్ 2లో రీ-విజిట్ చేసిన సెంటిమెంట్ మ్యూజిక్, డైలాగ్స్ వల్ల సినిమా హిట్ అయింది కానీ ఇదే ట్రాక్ మళ్లీ పండుతుందా అనేది అనుమానమే. పైగా హాలీవుడ్ ఆధారిత కథలు ఈ మధ్యకాలంలో ఓటీటీ కానీ థియేటర్లలో కానీ పెద్దగా వర్కవుట్ కాలేదన్న విశ్లేషణ ఉంది. ఇక సన్నీ ప్రస్తుతం బార్డర్ 2, లాహోర్ 1947 లాంటి ప్రాజెక్ట్‌లను కూడా చేతిలో ఉంచుకుని బిజీగా ఉన్నాడు.
కానీ ఓటీటీ వైపు వెళ్లడాన్ని చాలామంది అభిమానులు, పరిశ్రమ వర్గాలు ఒక డౌన్‌గ్రేడ్ లాగా చూస్తున్నారు. ఇప్పుడు బార్డర్ 2 వంటి సినిమాలతో మళ్లీ థియేటర్ ఫాలోయింగ్ రాబట్టగలిగితే గాని, అతని ఇమేజ్ నిలబడుతుంది. లేకపోతే ఈ ప్రయోగాలు నిలిపేసే అవసరం ఉంటుందన్న భావన స్పష్టంగా వినిపిస్తోంది.