‘గుంటూరు టాకీస్.. పడింది బొమ్మ చూడు’ అన్న పాటలానే ఎన్ని విమర్శలొచ్చినా థియేటర్లలో ఈ బొమ్మ బాగానే ఆడింది. బుల్లితెర అందం తొలిసారిగా వెండితెరపై చెలరేగిపోవడంతో టికెట్లు బాగానే తెగాయి. దాంతో ఈ సినిమా సీక్వెల్ ఆలోచన పురుడుపోసుకుంది. ఈ చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తారు సీక్వెల్ తనకేమాత్రం సంబంధం లేదని తెలిపినా నిర్మాత రాజ్ కుమార్ మాత్రం ఇంకొంత సొమ్ము పోగేసుకోవాలని తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు.
కథలో ముఖ్య భూమిక వహించిన హరి గిరి పాత్రలతో ఈ సీక్వెల్ కథ సిద్ధం చేశారు. అయితే వీరిద్దరి చోరీలు ఈ పర్యాయం ముంబైలో జరుగనున్నాయి. గిరి పాత్రలో నరేష్ కనపడనుండగా హరి పాత్రలో నిర్మాత స్నేహితుడి తనయుడు వినీత్ నటించనున్నాడు. అన్నిటికీ మించి ఈ సినిమాలో సన్నీ లియోన్ డాన్ గా కీలక పాత్ర పోషించనుడటం విశేషం. శ్రద్ధ దాస్ పాత్రలో అన్నమాట. ఈ కారణం చేతనే మకాం ముంబైకి మార్చారని గుసగుసలు. ఇన్నాళ్లు బాలీవుడ్ సినిమాలతోనే సెగలు రేపిన ఈ సెక్సిణి ఇప్పుడు తెలుగు సినిమాతోనూ కుర్రకారును హీటెక్కించనుంది. ఇప్పటివరకు ఓ ఐటెం సాంగ్ మినహా సౌత్ లో నటించని సన్నీని తన పెట్టుబడిగా చెప్పుకుంటున్న నిర్మాత ఈ సినిమాకి తానే దర్శకత్వం వహిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆర్జే హేమంత్ ఓ పాత్రలో దర్శనమివ్వనున్నాడు. అన్నట్టు రేష్మి స్థానంలోనూ ఓ కొత్త భామను ప్రవేశ పెట్టారు. దసరా రోజు (అక్టోబర్ 11)న పూజ కార్యక్రమాలతో సినిమా షూటింగ్ ప్రారంభమవనుంది.