కార్తీ, కమల్ హాసన్ లాంటి అతి తక్కువ మంది తమిళ హీరోలు మాత్రమే తెలుగులో అనువాదమవుతున్న తమ చిత్రాలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకొంటున్నారు. మిగతా హీరోలందరూ తమ సినిమాలను తెలుగులో డబ్బింగ్ రూపంలో విడుదల చేయడానికి చూపుతున్న ఆసక్తిలో సగం కూడా డబ్బింగ్ చెప్పడానికి కానీ సినిమాని ప్రమోట్ చేయడానికి కానీ చూపడం లేదు. అయితే.. మధ్యలో సూర్య మాత్రం ఒకసారి “బ్రదర్స్” సినిమా కోసం డబ్బింగ్ చెప్పడానికి ట్రై చేశాడు. ఆ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేయగా.. ఒక పాత్రకి తెలుగులో సూర్య, మరో పాత్రకి కార్తీ డబ్బింగ్ చెప్పారు. అయితే ఆ సినిమా సరిగా ఆడలేదనుకోండి.
మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత సూర్య మరోమారు తెలుగు రిలీజ్ కోసం తన గొంతు విప్పాడు. సూర్య-కీర్తి సురేష్ జంటగా తమిళంలో తెరకెక్కుతున్న “టి.ఎస్.కె” చిత్రాన్ని తెలుగులో “గ్యాంగ్” పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు. స్టూడియో గ్రీన్ సంస్థ తెలుగులో జనవరి 12న విడుదల చేస్తున్న ఈ చిత్రం టీజర్ నిన్న విడుదలైంది. ఈ టీజర్ లో సూర్య వాయిస్ విన్నవాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సూర్య వాయిస్ ఏమిటి అలా ఉందని ఆలోచించసాగారు. కట్ చేస్తే సూర్య “గ్యాంగ్” సినిమాలో తన రోల్ కి స్వయంగా డబ్బింగ్ చెప్పుకొన్నాడని తెలిసింది. ఆకట్టుకొనే స్థాయిలో అయితే సూర్య వాయిస్ లేదు, అందుకు కారణం చాన్నాళ్ల నుండి సూర్య కి డబ్బింగ్ చెబుతున్నతని వాయిస్ జనాలకి బాగా అలవాటైపోవడం. మరి టీజర్ తోనే ఆకట్టుకోలేని సూర్య సినిమాతో ఏమేరకు ఆకట్టుకొంటాడో చూడాలి. ఇకపోతే ఈ చిత్రం హిందీ సూపర్ హిట్ సినిమా “స్పెషల్ 26” రీమేక్ అవ్వడం విశేషం.