ఉలి దెబ్బలు పడితేనే రాయి శిల్పంగా మారుతుంది. అలాగే.. సరైన పాత్ర లభిస్తేనే ఏ నటైనా తన సత్తాను చాటుకోగలుగుతుంది. స్వరభాస్కర్ విషయంలో అదే జరిగింది. “రాంఝన్నా, ప్రేమ్ రతన్ ధన్ పాయో” వంటి చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించినప్పటికీ.. ఆమెలోని నటిని గుర్తించినవారు చాలా తక్కువమంది.
అయితే.. ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం “నీల్ బట్టే సన్నాట” మాత్రం స్వరభాస్కర్ నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో పరిచయం చేసింది. ఈ సినిమాలో తన కూతుర్ని చదివించుకోవాలని తపించే తల్లిగా.. అందుకోసం అహరహం శ్రమించే బాధ్యతాయుత స్త్రీగా స్వరభాస్కర్ పలికించిన హావభావాలు థియేటర్ లో ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించడంతోపాటు.. చప్పట్లు సైతం కొట్టిస్తున్నాయి.
గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ మరియు మౌత్ టాక్ పుణ్యమా అని రోజురోజుకీ పుంజుకోంటోంది. సోమవారం కూడా ఈ సినిమా మల్టీప్లెక్స్ లలో హౌస్ ఫుల్ అవ్వడం విశేషం!