అవార్డులు అనేవి కచ్చితంగా ప్రేక్షకులను మెప్పించిన పాత్రలకే దక్కుతుంటాయి అనేది అక్షర సత్యం. కానీ అవి కేవలం ప్రమోషన్ల కోసమే… కొంత మంది స్టార్లకు ఇస్తారు అనే వాదన కూడా ఉంది. ‘కేవలం ఓ బ్రాండ్ ను ప్రమోట్ చెయ్యడం కోసం స్టార్ హీరోలకు అవార్డులు ఇస్తారని.. ప్రతిభను చూసి ఇవ్వడం లేదు’ అని గతంలో కొంతమంది పెదవి విరిచారు. అయితే ‘అవార్డు రాలేదు అని బాధపడుతున్నారా?’ అని కొంతమంది సెలబ్రిటీలను అడిగినప్పుడు.. ‘వాటి కోసం ఎదురుచూసి.. అవి తీసుకోవడానికి హాజరయ్యే టైం మాకు లేదు’ అంటూ కొంతమంది హీరో, హీరోయిన్లు కవర్ చేస్తుంటారు.
అయితే మన మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అలాంటి కామెంట్సే చేసినప్పటికీ.. కొంచెం మసాలా ఎక్కువ యాడ్ చేసిందని చెప్పాలి. తమన్నాకు ఇప్పటి వరకూ చెప్పుకోదగిన అవార్డు దక్కించుకోలేదు. అలా అని తమన్నా ఆ స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఇచ్చింది కూడా లేదు.. ఎప్పుడూ గ్లామర్ రోల్స్ మాత్రమే చేస్తుంటుంది. ఒక్క ‘100% లవ్’ చిత్రంలో మాత్రమే ఆమె చెప్పుకోదగిన నటన ప్రదర్శించింది.దానికి టి.ఎన్.ఆర్ అవార్డు వంటిది వచ్చింది లెండి. ఇక ‘సైరా’ లో కూడా మంచి నటనే ప్రదర్శించింది కానీ ఆ పాత్ర చాలా చిన్నదే.
ఇక అక్కడక్కడా స్పెషల్ జ్యూరీ కేటగిరిల్లో ఏవో చిన్న చిన్న అవార్డులు తమన్నాకి వచ్చాయి కానీ.. లీడ్ రోల్ కి ఇంపార్టెన్స్ ఉండే అవార్డు అయితే రాలేదు. అందుకేనేమో.. ‘అవార్డు రాకపోయినంత మాత్రాన ఫేట్ మారిపోతుంది అనే భయం నాకు లేదు. నేను నటించిన సినిమాలు బాగా ఆడితే చాలు. అస్సలు అవార్డుల గురించి నేను ఆలోచించను’ అంటూ కామెంట్స్ చేసింది తమన్నా.