టాక్సీవాలా

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం “టాక్సీవాలా”. “ది ఎండ్” అనే షార్ట్ ఫిలిమ్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్న రాహుల్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. విడుదలకు కొన్ని నెలల ముందే ఆన్ లైన్ లో లీక్ అవ్వడం ఈ సినిమాకి ప్లస్ అయ్యిందా?, మైనస్ అయ్యిందా? అనేది పక్కన పెడితే.. సినిమాకి మంచి పబ్లిసిటీ మాత్రం ఇచ్చింది. మరి సినిమా హిట్ అయ్యిందా లేదా అనేది సమీక్ష చదివి తెలుసుకోండి..!!

కథ : మూడేళ్లలో పూర్తవ్వాల్సిన డిగ్రీని అయిదేళ్లపాటు చదివి పూర్తి చేసిన శివ (విజయ్ దేవరకొండ) ఉద్యోగం కోసం హైద్రాబాద్ లో మెకానిక్ గా వర్క్ చేస్తున్న తన బాబాయ్ (మధునందన్) దగ్గరకి వస్తాడు. డెలివరీ బాయ్ గా, సెక్యూరిటీగా వర్క్ తన బాబాయ్ చూపింకిన ఉద్యోగాలు చేయలేక స్వంతంగా ఒక టాక్సీ కొనుక్కొని నడుపుకోవాలనుకొంటాడు. అన్నయ్య-వదినల సహకారంతో కారు కొనడానికి డబ్బు ఎరేంజ్ చేసుకొంటాడు. అలా మంచి కారు కోసం వెతుకుతున్న శివకి దొరుకుతుంది మన టాక్సీ. చాలా ఓల్డ్ మోడల్ కారు అయినప్పటికీ.. దాన్ని రీమోడల్ చేసి కొత్త కారులా తయారు చేసి “ఓలా క్యాబ్స్”లో జాయిన్ అవుతాడు. మొదటి రైడ్ లోనే పరిచయమవుతుంది అను (ప్రియాంక జవాల్కర్). తాగేసి ఎక్కడికి వెళ్లాలో తెలియని కన్ఫ్యూజన్ లో కారులోని నిద్రపోతుంది. కానీ.. శివ ఆమెను సేఫ్ గా ఇంటికి చేరుస్తాడు. అలా మొదలైన వారి పరిచయం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారుతుంది.

సూపర్ కార్, మంచి జీతం, పక్కనే ప్రేమించిన అమ్మాయితో సాఫీగా సాగిపోతున్న శివ జీవితంలోకి సడన్ గా చిన్న జర్క్ వస్తుంది. ఆ జర్క్ మరేదో కాదు.. శివ చాలా ఇష్టపడి కొనుక్కొన్న కారే. ఆ కార్ లో ఏదో ఉంది? అది ఏంటి? అని తెలుసుకోవడం కోసం మొదలైన శివ జర్నీలో నమ్మలేని నిజాలు తెలుసుకొంటాడు. ఏమిటా నిజాలు? ఇంతకీ ఆ కార్ లో ఉన్నదేమిటి? అనేది తెలియాలంటే “టాక్సీవాలా” సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు : టాక్సీవాలా శివ పాత్రలో విజయ్ స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకొన్నాడు. అయితే.. తాను రెగ్యులర్ గా చేసే యాటిట్యూడ్ రోల్ కాకుండా బోయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ కావడంతో అతడి నటన జనాలకి ఇదివరకట్లా విపరీతమైన హై ఇవ్వదు. భయపడే సన్నివేశాల్లో సరిగ్గా ఎమోషన్ ను ఎలివేట్ చేయలేకపోయాడు కానీ.. ఓవరాల్ గా పర్వాలేదనిపించుకొన్నాడు. అతని రౌడీ గ్యాంగ్ అయితే ఖుష్ అయిపోతారు.

“పొసెసివ్ నెస్” అనే షార్ట్ ఫిలిమ్ తో పాపులారిటీ సంపాదించుకొన్న అనంతపూర్ పిల్ల ప్రియాంక జవాల్కర్ ఈ చిత్రంతో వెండితెరకు డీసెంట్ ఎంట్రీ ఇచ్చింది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకొంది. సెకండాఫ్ లో కాస్త కనుమరుగైనట్లు అనిపిస్తుంది కానీ.. రెండేళ్లపాటు వెయిట్ చేసినందుకు మంచి ఫలితమే దక్కింది. ఇండస్ట్రీకి ఇంకో తెలుగమ్మాయి సక్సెస్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు.

హాలీవుడ్ అనే పాత్రలో విజయ్ దేవరకొండ జూనియర్ విష్ణు సపరేట్ కామెడీ ట్రాక్ తో కాకుండా సిచ్యుయేషనల్ కామెడీతో ఆకట్టుకొన్నాడు. సెకండాఫ్ లో మనోడి పాత్ర భలే నవ్విస్తుంది. మధునందన్ డీసెంట్ పెర్ఫార్మెన్స్ తో అలరించాడు.

రవివర్మ చాలా కీలకమైన పాత్రకు న్యాయం చేయగా.. నెగిటివ్ రోల్లో సిజ్జు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వీళ్ళందరి తర్వాత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మాళవిక నాయర్ గురించి. ఆమె కళ్ళతోనే పాత్రకు న్యాయం చేసింది. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ మరియు పెర్ఫార్మెన్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.

సాంకేతికవర్గం పనితీరు : ముందుగా దర్శకుడు రాహుల్ గురించి మాట్లాడుకోవాలి. ఎప్పుడో “పెళ్ళిచూపులు” టైమ్ లో రాసుకొన్న కథ.. “అర్జున్ రెడ్డి” సినిమా తర్వాత పూర్తయిన చిత్రీకరణ. ఈ రెండేళ్లలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు రాహుల్. కానీ.. తాను రాసుకొన్న కథ, తెరకెక్కించిన కథనంపై విపరీతమైన నమ్మకం ఉండడంతో సినిమా పైరసీ లీక్ అయినా కూడా బెదరలేదు. ఆఖరికి విడుదలకు వారం ముందు కూడా మళ్ళీ లీకైనా ప్రింట్స్ ని కొందరు షేర్ చేస్తుంటే.. “ఈ మూడున్నర గంటల పైరసీ సినిమా.. నా 2.10 గంటల సినిమాకి ట్రైలర్ లాంటిది” అని రాహుల్ ఇచ్చిన స్టేట్ మెంట్ వెనుక ఉన్న కాన్ఫిడెన్స్ ఇవాళ సినిమా చూస్తున్నప్పుడు అర్ధమైంది. ఈ సినిమా ఒక ఎక్స్ పెరిమెంట్ కాదు, ఒక కథను నమ్ముకొని చేసిన ప్రయాణం.

మ్యాజిక్ లేదు.. లాజిక్ ఉంది. అందుకే.. అక్కడక్కడా టాక్సీ కాస్త నెమ్మదిగా వెళ్తున్నట్లు అనిపించినా.. ఓవరాల్ గా సేఫ్ జోన్ కి చేరుకుంది. భీభత్సమైన బ్లాక్ బస్టర్ అని చెప్పను కానీ.. టాక్సీవాలా ఒక డీసెంట్ హిట్. ముఖ్యంగా.. తొక్కలో కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి వెళ్లకుండా నిజాయితీతో తెరకెక్కించిన కథా బలం ఉన్న చిత్రం. అందుకు.. దర్శకుడు రాహుల్ ను అభినందించి తీరాల్సిందే. అన్నిటికంటే.. క్లైమాక్స్ ను హృద్యంగా డిజైన్ చేసిన రాహుల్ దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు.

సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కించిన ఈ చిత్రం అవుట్ చూస్తుంటే ఇది చిన్న సినిమా అని ఏ ఒక్క ఫ్రేమ్ లోనూ అనిపించదు. ఫ్రేమింగ్స్ చాలా కొత్తగా ఉన్నాయి. జేక్స్ బిజోయ్ సంగీతం ఆల్రెడీ హిట్ అవ్వగా.. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సౌండ్ డిజైనింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎడిటింగ్, డి.ఐ, కలరింగ్ ఇలా అన్నీ బాగా కుదిరాయి.

ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న సినిమాలో నెగిటివ్స్ లేవా అంటే ఉన్నాయి. ఫస్టాఫ్ స్క్రీన్ ప్లే చాలా రెగ్యులర్ గా ఉంటుంది. సినిమాకి చాలా కీలకమైన పాయింట్ అన్నీ వర్గాల ప్రేక్షకులకీ కనెక్ట్ అవ్వదు. సో, ఇలాంటి మైనస్ లు ఉన్నప్పటికీ ఓవరాల్ గా సినిమా బాగుంది కాబట్టి ఈ మైనస్ లు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.

విశ్లేషణ : కమర్షియల్ ఎలిమెంట్స్ లేని సెన్సిబుల్ ఫిలిమ్ గా “టాక్సీవాలా” నిలుస్తుంది. ఈవారం వచ్చిన పెద్ద సినిమా డిజాస్టర్ గా నిలవడంతో.. తెలుగు ప్రేక్షకులకి ఈ వారం చూడదగ్గ ఏకైక చిత్రంగా “టాక్సీవాలా” కాబట్టి కమర్షియల్ గా డీసెంట్ నెంబర్స్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది. అయితే.. బి,సి సెంటర్ ఆడియన్స్ సినిమాను ఎలా రిసీవ్ చేసుకొంటారు అనేదాన్ని బట్టి ఇది హిట్టా, సూపర్ హిట్టా అనేది డిసైడ్ అవుతుంది. అయితే.. “నోటా” లాంటి డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండకి “టాక్సీవాలా”తో మంచి హిట్ లభించినట్లే.

రేటింగ్ : 2.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus