ఒక్కోసారి ఫ్లాప్ సినిమాలు కూడా హిట్ అయిపోతుంటాయి. అందుకు కారణాలు చాలా ఉండొచ్చు. కానీ.. విచిత్రంగా నిన్న విడుదలైన “పంతం” సినిమాకి చాలా యావరేజ్ రిపోర్ట్స్ వచ్చినా కూడా ఈవారం హిట్ గా నిలిచిన చిత్రమదే. అందుకు కారణం ఇవాళ విడుదలైన “తేజ్ ఐ లవ్ యూ” కనీస స్థాయిలో కూడా ఆకట్టుకోలేకపోవడంతో ఈవారం ప్రేక్షకుల చూపు నిన్న విడుదలైన “పంతం” మీద పడింది. దాంతో నిన్నటివరకూ “పంతం” చిత్రాన్ని పట్టించుకోని ప్రేక్షకులందరూ ఇప్పుడు ఆ సినిమా చూడడంపై ఆసక్తి చూపుతున్నారు. దాంతో.. సినిమా ఫ్లాప్ అన్న బాధతో నిన్న సాయంత్రం వరకూ మిన్నకుండిపోయిన గోపీచంద్ & టీం అందరూ హ్యాపీగా ఊపిరి పీల్చుకున్నారు.
ఇప్పుడు “పంతం” ప్రమోషన్స్ స్పీడ్ కూడా పెంచారు. గోపీచంద్ మరియు అతని పి.ఆర్ టీం సినిమాని జనాలకి దగ్గర చేర్చడంపై దృష్టి సారించారు. సో, టీం గనుక కాస్త గట్టిగా కాన్సస్ ట్రేట్ చేస్తే “పంతం” కమర్షియల్ హిట్ అందుకోవడం అనేది పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఎందుకంటే.. వచ్చేవారం కూడా పెద్ద సినిమాలేవీ లేవు. అందువల్ల రెండు వారాలపాటు “పంతం” హ్యాపీగా మంచి కలెక్షన్స్ దక్కించుకోవచ్చు. మాస్ ఆడియన్స్ ను కాస్త ఆకట్టుకోగల ఫైట్స్, సాంగ్స్ తోపాటు కొన్ని ట్విస్టులు వర్కవుట్ అవ్వడమే ఇందుకు కారణం. మరి ఈ సదవకాశాన్ని “పంతం” టీం ఏమేరకు వినియోగపరుచుకుంటారో చూడాలి.