మెగా సన్మానం: ఇండస్ట్రీ సప్పుడు లేదు… గవర్నమెంట్‌ రెడీ అవుతోంది!

  • February 3, 2024 / 09:56 PM IST

చిరంజీవి పద్మ విభూషణ్‌ పురస్కారం ప్రకటించారు. ఇది ఆయన అభిమానులకు ఎంతో ఆనందం. సినిమా ప్రేక్షకులకు కూడా ఆనందమే. ఇప్పటికే ఆ ఆనందాన్ని వాళ్లు ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు కూడా. ఆ ఆనందం ఇండస్ట్రీలో కొంతమందికి ఉంది, మరికొంతమందికి లేదా? ఏమో ఆయనను విడివిడిగా ఇంటికెళ్లి కలిసి శుభాకాంక్షలు చెబుతున్నారు తప్ప… ఇప్పటివరకు ఇండస్ట్రీ పరంగా ఓ అభినందనో, సన్మానమో, గౌరవమో ఇవ్వాలనే ఆలోచన ఉందని అనిపించడం లేదు.

ఫిల్మ్‌ ఛాంబర్‌ తరఫున ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఆ మధ్య మాట్లాడుతూ త్వరలో కార్యక్రమం నిర్వహిస్తాం అని చెప్పారు తప్ప ఎక్కడా ఆ సప్పుడు లేదు. కొంతమంది హీరోలు కూడా ఇంతవరకు ఈ విషయంలో స్పందించలేదు. నేరుగా ఫోన్‌ చేసి ఏమైనా మాట్లాడారేమో మనకు తెలియదు అనుకోండి. బయటకు చెబితేనే కదా అభిమానులకు తెలిసేది, అంతా ఒక్కటే అని ఆనందపడేది. ఇండస్ట్రీ గౌరవం విషయం ఇప్పట్లో తేలేలా లేదు అని విమర్శలు కూడా వస్తున్నాయి.

అయితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం పద్మ విభూషణ్‌ చిరంజీవిని గౌరవించుకోవాలని నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. తెలుగు సినిమాకి చేసిన సేవలకుగాను చిరంజీవికి ప్రతిష్ఠాత్మక పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది భారత ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం ఇందుకుగాను చిరంజీవిని ప్రత్యేకంగా అభినందించాలని నిర్ణయం తీసుకుందట. ఈ మేరకు ఫిబ్రవరి 4న ఉదయం 10 గంటలకు శిల్ప కళా వేదికలో ఓ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసిందని సమాచారం.

ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి… చిరంజీవిని సత్కరించబోతున్నారట. చిరంజీవితో పాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి కూడా ఆహ్వానం అందించారని సమాచారం. పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా చిరంజీవి, వెంకయ్య నాయుడుకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ‘పద్మ’ అవార్డు గ్రహీతలను కూడా సత్కరించనున్నారు. దీంతో ఇదయ్యాకైనా ఇండస్ట్రీ మేలుకుంటుందేమో చూడాలి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus