విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) టైటిల్ పాత్రలో పరశురామ్ తెరకెక్కించిన చిత్రం “ది ఫ్యామిలీ స్టార్”(Family Star). మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు (Dil Raju) నిర్మించారు. గత చిత్రాల ఫలితాలతో కాస్త ఢీలాపడిన విజయ్ దేవరకొండ.. “ది ఫ్యామిలీ స్టార్” మీద చాలా ఆశలు పెట్టుకొన్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎన్నడూ లేని విధంగా దిల్ రాజు చాలా హుందాగా పాల్గొన్నారు. టీజర్, ట్రైలర్ & ప్రమోషన్స్ సినిమాకి మంచి బజ్ తీసుకొచ్చాయి. మరి సినిమా ఏ స్థాయిలో ఉందో చూద్దాం..!!
కథ: ఇద్దరు అన్నయ్యలు ఉన్నప్పటికీ.. కుటుంబ భారం మొత్తాన్ని తన భుజస్కంధాలపై మోస్తుంటాడు గోవర్ధన్ (విజయ్ దేవరకొండ). ఓ పెద్ద కంపెనీలో చిన్న ఆర్కిటెక్ట్ గా పని చేస్తున్న గోవర్ధన్ జీవితంలోకి, ఇంటిపైకి వస్తుంది ఇందు (మృణాల్ ఠాకూర్). ఈ ఇద్దరు మధ్య మొదలైన ప్రేమ ప్రయాణంలో ఊహించని విధంగా యూ టర్న్ తీసుకుంటుంది.
అసలు ఇందు ఎవరు? గోవర్ధన్ లైఫ్ లోకి ఎందుకు వస్తుంది? గోవర్ధన్ అన్నయ్యలు ఎందుకని అతనికి సపోర్ట్ చేయరు? అసలు గోవర్ధన్ ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏముంది? వంటి ప్రశ్నలకు సమాధానమే “ది ఫ్యామిలీ స్టార్”.
నటీనటుల పనితీరు: విజయ్ దేవరకొండ నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా డ్రెస్సింగ్ & స్టైలింగ్ విషయంలో మిడిల్ క్లాస్ యువకులను తలపించేలా చేసి.. వాళ్ళందరూ రిలేట్ అయ్యేలా చేశాడు. అందువల్ల విజయ్ క్యారెక్టర్ కి చాలామంది కనెక్ట్ అవుతారు. అయితే.. తెలంగాణ యాసలో ఆంధ్ర భావజాలం వినిపించడం సింక్ అవ్వలేదు. మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ అందంగా కనిపించింది. ఆమె పాత్రకు మంచి ట్విస్ట్ ఉంది.
అయితే.. విజయ్ & మృణాల్ మధ్య కెమిస్ట్రీ మాత్రం పండలేదు. ముఖ్యంగా సెకండాఫ్ లో మృణాల్ ను సైడ్ క్యారెక్టర్ లా పక్కన కూర్చోబెట్టేశారు తప్పితే పెద్దగా డైలాగులు కూడా ఇవ్వలేదు. రోహిణి హట్టంగిడి మాత్రం బామ్మ పాత్రలో ఆకట్టుకుంది. ఆమె చెప్పే ఎమోషనల్ డైలాగ్స్ కూడా బాగున్నాయి. వెన్నెల కిషోర్ (Vennela Kishore) నవ్వించడానికి ప్రయత్నించాడు కానీ పెద్దగా వర్కవుటవ్వలేదు. జగపతిబాబు(Jagapathi Babu) , అభినయ(Abhinaya) , వాసుకి (Vasuki) వంటి మంచి ఆర్టిస్టులకు సరైన పాత్ర లభించలేదు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడిగా పరశురామ్ (Parasuram) కెరీర్ లో పేలవమైన చిత్రంగా “ది ఫ్యామిలీ స్టార్”ను పేర్కొనవచ్చు. అమెరికాలో తెల్లమ్మాయిలు విజయ్ కోసం కొట్టుకొనే సన్నివేశాన్ని విజయ్ కానీ, దిల్ రాజు కానీ ఎలా ఓకే చేశారు అనేది ఆశ్చర్యపరిచిన విషయం. అలాగే.. అమెరికాలో ఇండియన్ ఇరుకిళ్ళు కట్టాలి అనే కాన్సెప్ట్ ను అంత హుందాగా చూపించడం కూడా ఎక్కడా వర్కవుటవ్వలేదు. అయితే.. రచయితగా మాత్రం కొన్ని సన్నివేశాలతో ఆకట్ట్కున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ డైలాగ్స్ తో తన సత్తా చాటుకొనే ప్రయత్నం చేశాడు. కానీ.. ఓవరాల్ గా మాత్రం దర్శకుడిగా అలరించలేకపోయాడు.
దిల్ రాజు & టీం ప్రొడక్షన్ విషయంలో ఎలాంటి రాజీపడలేదు. ఇంకా చెప్పాలంటే సినిమాకి కావాల్సినదానికంటే ఎక్కువే ఖర్చు చేశారు. లొకేషన్స్, సెట్స్ విషయంలో ఎక్కడా రాజీపడలేదు.
గోపీ సుందర్ (Gopi Sundar) తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయలేకపోయాడు. ముఖ్యంగా నేపధ్య సంగీతం సినిమాకి మెయిన్ మైనస్ గా నిలిచింది. సినిమాటోగ్రఫీ వర్క్ పర్వాలేదు. ఎడిటింగ్ వర్క్ కూడా సినిమాకి మైనస్ అనే చెప్పాలి. ఎందుకంటే.. చాలా సన్నివేశాల్లో ప్యాచ్ వర్క్ లు చేసినట్లుగా తెలిసిపోతుంది. అలాగే.. కొన్ని చోట్ల కట్స్ సరిగా కుదరలేదు.
విశ్లేషణ: ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ఆకట్టుకొనే చిత్రం “ది ఫ్యామిలీ స్టార్”. “గీతా గోవిందం” (Geetha Govindam) కాంబో కదా అని అదే స్థాయి ఎంటర్టైన్మెంట్ ఆశించి థియేటట్లకు వెళ్తే మాత్రం కాస్త నిరాశచెందే అవకాశం ఉంది.
ఫోకస్ పాయింట్: ఫక్తు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం మాత్రమే!
రేటింగ్: 2.5/5