ఇటీవల రిలీజ్ అయిన ఓ హాలీవుడ్ సినిమా గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అదే ది ఒడిస్సీ. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఈ సినిమాకు దర్శకుడు కావడమే దీనికి కారణం. ఆ పేరు తలచుకోగానే ఫాలోయింగ్, మెమెంటో, ది ప్రెస్టిజ్, ది డార్క్ నైట్, ఇన్‌సెప్షన్, ఇంటర్‌స్టెల్లార్, టెనెంట్, ఓపెన్ హైమర్ వంటి విజువల్ వండర్స్ కళ్ల ముందు కనిపిస్తాయి. భారీ విజువల్ ఎఫెక్ట్స్, కట్టిపడేసే కథనం, ఊహాకందని మరో ప్రపంచంలోకి ఆయన సినిమాలు తీసుకెళ్తాయి. అలాంటి నోలన్ దర్శకత్వంలో వచ్చిన విజువల్ వండర్ ది ఒడిస్సీ. విడుదలకు నెల క్రితం నుంచే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవ్వగా.. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. రిలీజ్ తర్వాత ఫస్ట్ వీకెండ్‌లోనే వరల్డ్ వైడ్‌గా దాదాపు 2500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది ది ఒడిస్సీ.
భారతదేశంలోనూ మన హీరోలకు వచ్చే రేంజ్‌లో ఈ సినిమా వసూళ్ల పంట పండిస్తూ వారం తిరిగేసరికి 100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఒక ఇంగ్లీష్ మనదేశంలో ఇలాంటి వసూళ్లను రాబట్టడం మామూలు విషయం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ది ఒడిస్సీకి ఓ తెలుగు సినిమాకి కనెక్షన్ పెడుతున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో హాలీవుడ్‌లో తయారైన మూవీకి మన తెలుగు సినిమాకి లింక్ ఏంటీ? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ తెలుగు ప్రేక్షకులు ఈ రెండు సినిమాలకు లింక్ వేయడానికి దారి తీసిన కారణం ఏంటీ? ది ఒడిస్సీతోనే లింక్ పెట్టుకున్న ఆ తెలుగు సినిమా ఏంటంటే? యుద్ధంలో గెలిచి తిరిగి తన ఇంటికి చేరుకునేందుకు ఒడిస్సీకి రకరకాల అవరోధాలు ఎదురవుతాయి.
ఒక్కొక్క అడ్డంకినీ ఎదుర్కొని తన రాజ్యానికి చేరుకున్న ఒడిస్సీకి మహారాణి ఓ పరీక్ష పెడుతుంది. జంటగా కలిపిన ఓ 12 గొడ్డళ్ల మధ్యలో నుంచి బాణంతో టార్గెట్‌ను ఛేదించాలి. కొందరు యోధులు వచ్చి పరీక్షలో పాల్గొని లక్ష్యాన్ని చేరలేక చేతులెత్తేస్తారు. అప్పటికే బిచ్చగాడిగా మారు వేషంలో ఉన్న ఒడిస్సీ జరిగేదంతా జాగ్రత్తగా గమనించి టార్గెట్ కొట్టడంతో అంతా అవాక్కవుతారు. ఈ సీన్ చూసిన తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి దృశ్యం లాంటిదే ఎక్కడో చూసినట్లుగా అనిపించి వెంటనే మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజీ గుర్తొస్తోంది.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి నటించిన అంజి.. సాంకేతికంగా పాతికేళ్ల క్రితమే సంచనలం సృష్టించింది. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ పరంగా పాతికేళ్ల కిందటే అద్భుతంగా ఉందని క్రిటిక్స్ సైతం ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలోని ఓ సీన్‌లో రమ్యకృష్ణ ఓ సవాల్ విసురుతుంది. గాల్లోకి విసిరిన గాజుల మధ్యలో నుంచి కుండను బాణంతో కొట్టాలి. కొందరు ఫెయిల్ అవ్వగా చిరంజీవి వచ్చి వావ్ అనిపిస్తాడు. ఈ సన్నివేశాన్ని .. ది ఒడిస్సీలోని సన్నివేశంతో పోల్చి చూస్తున్నారు ప్రేక్షకులు. క్రిస్టోఫర్ నోలన్ క్రియేటివిటీకి ఏ మాత్రం తగ్గని రేంజులో పాతికేళ్ల కిందటే మన కోడి రామకృష్ణ ఇదే తరహా సీన్‌ని సెల్యూలాయిడ్‌పై ఆవిష్కరించారని ప్రశంసలు కురిపిస్తున్నారు.