బాస్ ఈజ్ బ్యాక్!!

ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు… రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరినోట విన్నా ఇప్పుడు ఇదే మాట!
అవును బాస్ ఈజ్ బ్యాక్!!ఈ నెల 23న మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. దర్శకుడు వి.వి. వినాయక్ మెగాఫోన్ పట్టుకుని ఇలా యాక్షన్ చెప్పారో లేదా… అలా ఆల్ ఛానెల్స్ లోనూ బ్రేకింగ్ న్యూస్ మొదలైపోయింది. మెగాస్టార్ మూవీకి సంబంధించిన ముచ్చట్లలను కోట్లాది వీక్షకులకు ఛానెల్స్ క్షణాల్లో చేరవేశాయి. ప్రత్యేక బులిటెన్లను ప్రసారం చేశాయి. ఈ హంగామాను వీక్షించిన మెగాభిమానుల్లోనూ ఉరకలెత్తే ఉత్సాహం నెలకొంది. వాడవాడలా చిరు రీ-ఎంట్రీని పండగలా చేసుకున్నారు.దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత పూర్తి స్థాయి పోషిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఈ కొత్త సినిమాలో ఎలా ఉండబోతున్నారు… ఎలా నటిస్తారు… అప్పటి గ్రేస్… అప్పటి ఉత్సాహం… అప్పటి బాడీలాంగ్వేజ్ లోని ఈజ్ ఆయనలో ఇప్పటికీ ఉన్నాయా? అనే సందేహమూ కొందరికి కలిగి ఉండొచ్చు. ఆ సందేహానికీ ఓ సమాధానం దొరికింది. అదే ‘మా టీవీ’ అవార్డ్స్ ఫంక్షన్! చిరంజీవి 150వ చిత్రానికి ఈ వేడుకకు లింక్ ఏమిటీ అనుకోవచ్చు. అక్కడికే వస్తున్నాం. ఆదివారం ప్రసారం అయిన ‘మా టీవీ’ అవార్డుల వేడుకలో చిరంజీవి నటుడిగా మరోసారి తన సత్తా చాటుకున్నారు. ఒకటికాదు రెండు కాదు… ఏకంగా ఆరు గెటప్స్ తో… తన ఐదు చిత్రాలకు సంబంధించిన సన్నివేశాలతో అద్భుతంగా వీక్షకులను అలరించారు. దీనికి సంబంధించిన షూటింగ్ మొత్తం ఒక్కరోజులో జరిగిందంటే ఆశ్చర్యం కలగకమానదు. ముఖానికి మేకప్ వేసుకున్న తర్వాత చిరంజీవిని నటరాజు పూనతాడంటే ఖచ్చితంగా నమ్మొచ్చు! అదే జరిగింది.కళాతపస్వి కె. విశ్వనాథ్ అద్భుత కళాసృష్టి ‘స్వయంకృషి’ విడుదలై 29 సంవత్సరాలైంది. అందులో చిరంజీవి పోషించిన సాంబయ్య పాత్రను ఎవరు మాత్రం మర్చిపోగలరు. ఈ చిత్రానికి గానూ చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. ఆ గెటప్ ను ఇప్పుడు చిరంజీవి చేస్తే ఎలా ఉంటుంది?ఇక చిరంజీవి కెరీర్ లో మరో మాస్సీవ్ హిట్ ‘ఘరానా మొగుడు’. అందులోని రాజు పాత్రను అప్పట్లో ప్రతి యువకుడు తమలో చూసుకున్నారు. ఆ రాజుగా ఇప్పుడు చిరంజీవి కనిపిస్తే ఎలా ఉంటుంది?ఇక ముఠామేస్త్రీ లోని బోసు, ఇంద్ర సేనారెడ్డి, శంకర్ దాదా… వీళ్ళందరినీ ఇప్పుడు చిరంజీవిలో చూడగలమా!? ఎస్. చూడగలం… ఆ కోరికను తీర్చేసింది ‘సినీమా అవార్డ్స్’ ఫంక్షన్. చిరంజీవిలోని అప్పటి గ్రేస్ ఇంకా అలానే ఉంది. చిరంజీవిలోని అప్పటి యాక్టీవ్ నెస్ అలానే ఉంది. చిరంజీవిలోని అప్పటి బాడీ లాంగ్వేజ్ ఇంకా ఇంకా అలానే ఉంది. అంతేకాదు… దానికి మరి కాస్తంత అనుభవం కూడా తోడై… ఆ పాత్రల్లో మరింత పరిపూర్ణత కనిపించింది.

ఇక మరో విశేషం ఏమంటే…‘స్వయంకృషి’లోని ఇన్ స్పైరింగ్ ఎలిమెంట్, ‘ఘరానా మొగుడు’లోని ఎంటర్ టైన్ మెంట్, ‘ముఠామేస్త్రీ’లోని మాస్ అప్పీల్, ‘ఇంద్ర’లోని యాక్షన్, ‘శంకర్ దాదా ఎంబీబీయస్’లోని కామెడీ… ఇవన్నీ కూడా మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలోనూ ఉండబోతున్నాయి. సో… ఈ 150వ చిత్రానికి ‘మాటీవీ అవార్డు’ల వేడుకలో చిరు చేసిన కార్యక్రమం ఓ ట్రైలర్ లాంటిదన్నమాట!
ఈ నెల 23న మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సంక్రాంతి కానుకగా రావడం కోసం వి.వి. వినాయక్ బృందం ప్రయత్నిస్తోంది. అందుకు మెగాస్టార్ తన సంపూర్ణ సహకారం అందిస్తున్నారు.
సో… కోట్లాది మంది ప్రేక్షకులు… సినీజనం అనుకుంటున్నట్టుగానే
బాస్ ఈజ్ బ్యాక్!
మెగాస్టార్ ఈజ్ బ్యాక్!!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus