Daaku Maharaaj: ‘డాకు మహారాజ్‌’ అనంతపురం ఈవెంట్‌ రద్దు… ఎందుకంటే?

నందమూరి బాలకృష్ణ – కేఎస్‌ రవీంద్ర (బాబీ) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘డాకు మహారాజ్‌’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఈ రోజు అనంతపురంలో భారీగా నిర్వహించాలని ప్లాన్‌ చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ మంత్రి, బాలకృష్ణ అల్లుడు నారా లోకేశ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు కూడా. అయితే ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Daaku Maharaaj

తిరుపతిలో జరిగిన ఘటన నేపథ్యంలో కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ సోషల్‌ మీడియాలో ప్రకటించింది. తిరుపతిలో జరిగిన ఘటనకు మా చిత్రబృందం బాధ పడుతోంది. పవిత్ర స్థలంలో ఇలాంటి ఘటన జరగడం హృదయ విదారకం. ఇలాంటి పరిస్థితుల్లో మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరపడం సరికాదని భావిస్తున్నాం. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని నేడు జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాం అని ఆ పోస్టులో పేర్కొంది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో 41 మందికి గాయాలయ్యాయని టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు. అంబులెనస్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం కూడా కారణమని ప్రాథమిక సమాచారం.

ఇక ఈ సినిమా గురించి చూస్తూ.. బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మించింది. ఈ నెల 12న సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఈవెంట్‌ను రద్దు చేసిన నేపథ్యంలో మరో రోజు నిర్వహిస్తారా లేక ప్రెస్‌ మీట్‌తో సరిపెడతారా అనేది చూడాలి. ఎందుకంటే సినిమా విడుదలకు ఇంకా గట్టిగా రెండు రోజులే ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus