Thiruveer : టాలీవుడ్‌లో ఇటీవల వరుసగా స్టార్ సెలబ్రిటీల నుంచి శుభవార్తలు వినిపిస్తున్నాయి. కొందరు పెళ్లి చేసుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటే, మరికొందరు తల్లిదండ్రులుగా ప్రమోట్ అవుతూ అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా గుడ్ న్యూస్ తెలియజేసారు టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్. సోషల్ మీడియా ద్వారా తన జీవితంలో చోటుచేసుకున్న ఈ ప్రత్యేకమైన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు.
తన చిన్నారి కొడుకు చేతిని పట్టుకొని ఉన్న ఫోటోను షేర్ చేసిన తిరువీర్, “నాయినొచ్చిండు” అంటూ లవ్ సింబల్ తో క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టు క్షణాల్లోనే వైరల్ అయ్యింది. “నా తండ్రి తిరిగి నా కొడుకుగా పుట్టాడు” అంటూ తన భావోద్వేగాలను వ్యక్తం చేసిన ఆయన పోస్టును అభిమానులు ప్రేమతో షేర్ చేస్తున్నారు. తిరువీర్ భార్య కల్పన ఇటీవల ఆరోగ్యవంతమైన మగబిడ్డకు జన్మనివ్వగా, ఈ శుభవార్తను ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
హైదరాబాద్ యువ నటుడైన తిరువీర్, చిన్న చిన్న పాత్రలతో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించి తనదైన నటనతో ‘జార్జి రెడ్డి’, ‘జగదీష్, ‘పరేషాన్’, ‘మసూద’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షోతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన, ప్రస్తుతం వరుస చిత్రాలకు కమిట్ అవుతూ బిజీ బిజీగా ఉన్నారు. తండ్రిగా ప్రమోట్ అయిన తిరువీర్‌కు అభిమానులు, స్నేహితులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.