శుక్రవారం అన్నాక సినిమాలు రిలీజవ్వడం, కొన్ని హిట్టవ్వడం, ఇంకొన్ని ఫ్లాప్ అవ్వడం అనేది సర్వసాధారణంగా ప్రతివారం జరిగేదే. అయితే.. గత శుక్రవారం మాత్రం ఎవరూ ఊహించనివిధమైన రిజల్ట్ వచ్చింది. నాగశౌర్య-రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకొన్నప్పటికీ.. ఆదేవారం విడుదలవుతున్న మాస్ మహారాజా “టచ్ చేసి చూడు” ముందు నిలవలేదేమో అనే సందేహం ఉండేది. ముఖ్యంగా “రాజా ది గ్రేట్” లాంటి సూపర్ హిట్ అనంతరం రవితేజ నటించిన చిత్రం కావడం, మాస్ మసాలా సినిమా కావడంతో ఆడియన్స్ అందరూ “టచ్ చేసి చూడు”వైపే మొగ్గుచూపుతారనుకొన్నారు.
కట్ చేస్తే.. సీన్ రివర్స్ అయ్యింది. రవితేజ “టచ్ చేసి చూడు” ఫ్లాప్ గా మొదటి ఆటతోనే డిక్లేర్ చేయబడడంతో అందరి చూపు “ఛలో” మీద పడింది. ఇక ఇదేవారం విడుదలైన మరో ప్రేమకథా చిత్రం “హౌరా బ్రిడ్జ్” కనీస స్థాయిలో కూడా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోవడంతో “ఛలో”కి పోటీ లేకుండాపోయింది. “ఛలో” టికెట్స్ కోసం సింగిల్ స్క్రీన్ వద్ద మాత్రమే కాదు మల్టీప్లెక్స్ ల వద్ద కూడా మినీ యుద్ధాలు జరుగుతుండడం సినిమా సాధించిన విజయానికి నిదర్శనం. సో, ఎలాంటి సందేహాలు, అతిశయోక్తులు లేకుండా “ఛలో” చిత్రాన్ని ఈవారం విన్నర్ గా ప్రకటించింది తెలుగు సినిమా బాక్సాఫీసు. వచ్చే శుక్రవారం వరకూ భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టే “ఛలో” వచ్చేవారం విడుదలల రిజల్ట్ బట్టి సెకండ్ వీక్ కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి.