“దంగల్” లాంటి యూనివర్సల్ హిట్ అనంతరం అమీర్ ఖాన్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం “థగ్స్ ఆఫ్ హిందూస్తాన్”. అమీర్ కి తోడుగా అమితాబ్ బచ్చన్ కూడా తొడవ్వడంతో షూటింగ్ టైమ్ నుంచే ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్యాస్టింగ్ కి కత్రినా గ్లామర్ కూడా తొడవ్వడంతో సినిమా తప్పకుండా మరో బ్లాక్ బస్టర్ అవుతుందనుకొన్నారందరూ. మరి సినిమా వారి అంచనాలను అందుకోగలిగిందా లేదా? అనేది చూద్దాం..!!
కథ : 1795లో సాగే ఈ కథలో ఫిరంగీ (అమీర్ ఖాన్) ఒక దొంగ. మామూలు దొంగ కాదండోయ్.. గొప్ప మోసగాడు కూడా. అతడు ఎవరికి అండగా నిలుస్తున్నాడు? ఎవర్ని మోసం చేస్తున్నాడు అనేది చివరివరకు ఎవరికీ అర్ధం కాదు. స్వేచ్ఛ కోసం పోరాడుతూ.. మరింత మంది భారతీయులను తనవైపు ఆకర్షితులను చేసుకొంటున్న ఆజాద్ అలియాస్ ఖుదా బక్ష్ (అమితాబ్ బచ్చన్) మరియు అతనికి తోడుగా ఉండే జఫీరా (ఫాతిమా సనా షేక్)ను ఈస్ట్ ఇండియా కంపెనీకి పట్టించే పనిని ఫిరంగీకి అప్పగిస్తాడు క్లివ్.
తొలుత తన సహజమైన వ్యక్తిత్వమైన మోసపూరిత స్వభావంతో ఖుదాబక్ష్ ను మోసం చేసిన ఫిరంగీ.. అనంతరం అతడి ఆశయాన్ని అర్ధం చేసుకొని ఆజాద్ సైన్యానికి నాయకత్వం వహించి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎదురు తిరుగుతాడు. ఆ తర్వాత జరిగిన పోరాటంలో ఎవరు గెలిచారు అనేది “థగ్స్ ఆఫ్ హిందుస్తాన్” కథాంశం.
నటీనటుల పనితీరు : అమీర్ ఖాన్ పాత్ర “పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్” చిత్రంలో జాక్ స్పారో క్యారెక్టర్ ను తలపించినప్పటికీ.. కాస్త ఎంటర్ టైనింగ్ గానే ఉంది. నిజానికి సినిమా మొత్తంలో కాస్త ఆసక్తికరంగా ఉన్న పాత్ర అమీర్ ఖాన్ దే. టిపికల్ బాడీ లాంగ్వేజ్ & డైలాగ్ డెలివరీతో ఆకట్టుకొన్నాడు అమీర్ ఖాన్. అమితాబ్ బచ్చన్ ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్ అయినప్పటికీ.. ఆయన పాత్ర పేరుకి ఉన్న వెయిట్ క్యారెక్టరైజేషన్ కి లేదు. అందువల్ల సినిమాలో ఆయన్ను అనవసరంగా కష్టబెట్టారనిపిస్తుంది తప్ప.. సినిమాకి ఆయన వల్ల ఒరిగిందేమీ లేదు.
“దంగల్” ఫేమ్ ఫాతిమా సనా షేక్ ఈ సినిమాలోనూ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది కానీ.. ఆమె క్యారెక్టర్ కి సరైన క్లారిటీ లేదు. పైగా పెద్దగా సన్నివేశాలు కూడా లేవు. కత్రినా మరోసారి తన సొగసులతో, నృత్యాలతో మత్తెక్కించింది. ఆమె పాత్ర కథా గమనానికి ఏమాత్రం అవసరం లేకపోయినప్పటికీ.. రెండు ఐటెమ్ సాంగ్స్ తో కాస్త రిలీఫ్ ఇచ్చింది కత్రినా. కాకపోతే.. ఆమె కష్టపడి చేసిన డ్యాన్స్ మూమెంట్స్ కి సంగీతంతో సంబంధం లేకపోవడంతో ఆమె కష్టం బూడిదలో పోసిన పన్నీరుని తలపిస్తుంది.
సాంకేతికవర్గం పనితీరు : అజయ్-అతుల్ సంగీతం సినిమాకి పెద్ద మైనస్. అసలే కథ-కథనాల్లో ఆసక్తి లేదంటే దానికి వీళ్ళ సంగీతం, నేపధ్య సంగీతం తొడవ్వడంతో ప్రేక్షకుడికి వద్దన్నా నీరసం వచ్చేస్తుంది.
మనుష్ నందన్ సినిమాటోగ్రఫీ పుణ్యమా అని యష్ రాజ్ సంస్థ ఖర్చు చేసిన 300 కోట్ల రూపాయలు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంటాయి. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీపడలేదని ప్రతి సీన్ లో స్పష్టమవుతూనే ఉంటుంది.
డైరెక్టర్ విజయ్ కృష్ణ ఆచార్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. “ధూమ్ 3” సినిమానే సాగదీసి సాగదీసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిన ఈ మహానుభావుడిలో ఏం నచ్చి అమీర్ ఖాన్ మరో అవకాశం ఇచ్చాడో ఇప్పటికీ అర్ధం కాదు. ప్రేక్షకుల్ని ఆకట్టుకోగల కథ లేదు, వాళ్ళని థియేటర్ లో కూర్చోబెట్టగల కథనం లేదు, ఇక స్టార్ హీరోలను ఏదో జూనియర్ ఆర్టిస్టులను వాడినట్లుగా వాళ్ళ ప్రతిభను కాక కేవలం స్టార్ డమ్ ను వాడుకొన్న తీరు చూస్తే బాధేస్తుంది. 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. కనీసం 50 కోట్ల రూపాయల అవుట్ పుట్ కూడా ఇవ్వలేకపోయాడు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు థియేటర్ నుంచి ఎప్పుడు బయటపడాలా అన్న ఆలోచన తప్ప మరొకటి వారి బుర్రలోకి రాదు.
విశ్లేషణ : ఈ ఏడాది చివర్లో బాలీవుడ్ రివ్యూలో “వరస్ట్ మూవీస్ ఆఫ్ ది ఇయర్” అని గనుక ఎవరైనా ఒక జాబితా తయారు చేస్తే.. నిస్సందేహంగా మొదటి స్థానంలో నిల్చోగల సత్తా ఉన్న చిత్రం “థగ్స్ ఆఫ్ హిందుస్తాన్”.
రేటింగ్ : 1/5