ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల రేట్ల గురించి చర్చ వచ్చినప్పుడల్లా… ప్రేక్షకుల వైపు నుండి కూడా ఆలోచించండి అని సామాన్యులు అక్కడక్కడ అనడం వినిపిస్తుంటుంది. కారణం సామాన్యుడి వినోదం అయిన టికెట్ రేట్లు కొండెక్కకుండా ఉంటే బాగుంటుంది అని వారి అభిప్రాయం. అదేంటి ఈ ధరలతో థియేటర్లు బతికేదెలా అని మీరు అనొచ్చు. అయితే అవకాశం వచ్చింది కదా అని జనాల మీద రేట్లతో వీరబాదుడు బాదేస్తే వాళ్లేం అయిపోవాలి. గత కొన్నేళ్లుగా ఈ సమస్యతో జనాలు బాధపడుతూనే ఉన్నారు. మరోసారి ఆ సమస్య కనిపిస్తోంది.
అయితే ఈసారి సమస్య కేవలం తెలంగాణలో మాత్రమే. కారణం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవో. టికెట్ రేట్లను అమాంతం పెంచేసింది. దీంతో దొరికందే అవకాశంగా సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లు ధరలు పెంచేశాయి. ఏ రేంజిలో అంటే కొన్ని థియేటర్లలో డబుల్ కూడా అయిపోయాయి. ఉదాహరణకు ప్రసాద్ ఐమ్యాక్స్ గురించే చూద్దాం. మొన్నటివరకు రూ. 150గా ఉన్న టికెట్ ధరను ఒక్కసారిగా రూ. 295 చేసేశారు. ఈ ధరతో పెద్ద హీరోల సినిమాలు చూడటానికి ప్రేక్షకులు వస్తారేమో కానీ…చిన్న సినిమాలకు ఎవరైనా ముందుకొస్తారా చెప్పండి.
ఇంకా చెప్పాలంటే ఆ టికెట్ ధరకు మరో వందో, రెండొందలో కలిపితే ఓటీటీల్లో ఏడాది సబ్‌క్రిప్షన్ వచ్చేస్తుంది. అలాంటిది అంత రేటు పెట్టి సినిమాలు చూడాలా? చూస్తారా? అంటే తెలుగువాళ్లు సినిమా పిచ్చోళ్లు కాబట్టి చూస్తారు అనే సమాధానం వస్తుంది. అయితే సినిమా చూస్తున్నారు కదా అని ఎంతంటే అంత రేటు పెట్టేస్తే ఎలా అనేది సినిమా వాళ్లే అర్థం చేసుకోవాలి. టికెట్ ధరల కోసం గొంతు చించుకుంటున్నవాళ్లు మరి ప్రేక్షకుల మీద వేస్తున్న ఈ బాదుడు గురించి కూడా మాట్లాడితే బాగుండు అనే వాదనా వినిపిస్తోంది.
తెలంగాణలో టికెట్ ధరలు ఇలా ఉన్నాయి….
* ఏసీ థియేటర్‌లలో కనిష్ఠ ధర రూ.50 కాగా, గరిష్ఠంగా రూ.150గా టికెట్ ధరను నిర్ణయించారు. దీనికి జీఎస్టీ అదనం.
* మల్టీప్లెక్స్‌ల్లో కనీస టికెట్ ధర రూ.100+జీఎస్‌టీ. గరిష్ఠంగా రూ.250+జీఎస్‌టీ.
* సింగిల్ థియేటర్లలో స్పెషల్ రిక్లైనర్ సీట్లకు రూ.200+ జీఎస్‌టీ.. మల్టీప్లెక్స్‌లలో రూ.300+ జీఎస్‌టీ.
* నిర్వహణ ఛార్జీల కింద ఏసీ థియేటర్‌లలో రూ.5, నాన్ ఏసీకి రూ.3 వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!