“ప్రేమలో ఉండడమే.. ప్రపంచంలో అత్యుత్తమ భావన” అంటోంది శృంగార కథానాయిక మల్లికా షెరావత్. ఇప్పుడీ ప్రేమ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చిందని ఆలోచిస్తున్నారా? గత పదిహేనేళ్లుగా ప్రేక్షకులను తన అందాలతో అలరిస్తున్న ఈ భామ ప్రేమలో పడింది. పారిస్ వ్యాపారవేత్త సైరిల్ ఔక్షన్ ఫాన్స్ తో గత కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తుందట. తాను ప్రేమలో ఉన్నట్లు గురువారం సోషల్ మీడియాలో మల్లికా షెరావత్ ద్రువీకరించింది. లేటు వయసులో ఘాటు ప్రేమాయణాలు సాగిస్తున్న బాలీవుడ్ భామల జాబితాలో చేరింది. ప్రీతి జింటా(41), ఊర్మిళా(42) ఇటీవల ఓ ఇంటి వారయ్యారు.
39ఏళ్ల మల్లికా షెరావత్ సైతం త్వరలో పెళ్లి పీటలు ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని ముంబై జనాలు వ్యాఖ్యానిస్తున్నారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా మల్లిక, సైరిల్ పరిచయం జరిగింది. పరిచయం ప్రేమగా మారడానికి ఎక్కువ రోజులు పట్టలేదట. ప్రస్తుతం ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత పిచ్చి ప్రేమగా మారిందని సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారట. ప్రేమికుల రోజున ఖరీదైన లగ్జరీ కారుతో పాటు విలువైన బహుమతులతో ప్రేయసిని సంతోషపెట్టాడట సైరిల్. ప్రియుడి చర్యలకు యువరాణి ఫీలైందట మల్లిక. వ్యక్తిగతంగానూ.. వృత్తిపరంగానూ.. ప్రస్తుతం మల్లికా షెరావత్ మేఘాల్లో తేలుతుంది. డేనియల్ లీ దర్శకత్వంలో నటించిన ‘ది లాస్ట్ టూంబ్’ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రేమలోనూ సంతోషమే!!