డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పుణ్యమా అని టాలీవుడ్(Tollywood) మిడ్ రేంజ్ హీరోల మార్కెట్ తీవ్ర సంక్షోభంలో పడింది. ఒకప్పుడు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఆ ‘హిందీ డబ్బింగ్’ బిజినెస్ ఇప్పుడు దాదాపు ‘జీరో’ అయిపోయింది.
దీంతో రవితేజ, రామ్ లాంటి స్టార్స్ కూడా చేసేది లేక తమ రెమ్యునరేషన్స్ తగ్గించుకునే పరిస్థితికి వచ్చేశారు.ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఒకప్పుడు మాస్ మహారాజా రవితేజ, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, గోపీచంద్, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి హీరోల సినిమాలకు నార్త్‌లో మామూలు క్రేజ్ ఉండేది కాదు.
వీళ్ల సినిమాల హిందీ డబ్బింగ్, శాటిలైట్, యూట్యూబ్ రైట్స్ కోసం బయ్యర్లు క్యూ కట్టేవారు. ఒక్కో సినిమాకు ఏకంగా రూ.20 కోట్ల నుంచి 25 కోట్ల వరకు హిందీ రైట్స్ రూపంలోనే నిర్మాతలకు వచ్చేవి. అంటే సినిమా బడ్జెట్‌లో దాదాపు 40 శాతం అక్కడే రికవరీ అయిపోయేది. దీంతో ప్రొడ్యూసర్లకు పెద్దగా రిస్క్ ఉండేది కాదు.
కానీ ఇప్పుడు హిందీ డబ్బింగ్ మార్కెట్ అమాంతం పాతాళానికి పడిపోయింది. దీనికి మెయిన్ రీజన్ ఓటీటీలే. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా లాంటి దిగ్గజ సంస్థలు ఇప్పుడు అన్ని భాషల (పాన్ ఇండియా) స్ట్రీమింగ్ రైట్స్‌ను ఒకేసారి బల్క్‌గా కొనేస్తున్నాయి. ఓటీటీల్లోనే హిందీ ఆడియో అందుబాటులో ఉంటుండటంతో.. యూట్యూబ్‌లో డబ్బింగ్ సినిమాలు చూసేవారి సంఖ్య దారుణంగా పడిపోయింది. దీనికి తోడు జనాలు టీవీల్లో సినిమాలు చూడటం కూడా బాగా తగ్గించేయడంతో.. శాటిలైట్ మార్కెట్ పూర్తిగా కుదేలైంది. ఫలితంగా హిందీ రైట్స్ కొనేందుకు బయ్యర్లు ఎవరూ ముందుకు రావడం లేదు.
ఈ పరిణామాలతో ఇప్పుడు రామ్, రవితేజ, గోపీచంద్, బెల్లంకొండ లాంటి హీరోల మార్కెట్ డేంజర్‌లో పడింది. హిందీ రైట్స్ రూపంలో వచ్చే సేఫ్టీ పోవడంతో.. ఇప్పుడు థియేటర్లలో సినిమా బ్లాక్ బస్టర్ అయితేనే నిర్మాతలు గట్టెక్కే పరిస్థితి వచ్చింది. ఈ నాన్-థియేట్రికల్ బిజినెస్ దెబ్బతినడం, దానికి తోడు రీసెంట్‌గా ఈ హీరోలందరికీ వరుస ఫ్లాపులు పడుతుండటంతో.. ప్రొడ్యూసర్ల భారాన్ని తగ్గించేందుకు వీళ్లంతా తమ పారితోషికాలకు భారీగా కోత పెడుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.