రేవంత్‌ రెడ్డి వీడియో అడిగారు.. టాలీవుడ్‌ పాట రెడీ చేసి ఇస్తుందా?

సమాజానికి ఏదైనా సాయం అవసరమైనా, ఏదైనా పిలుపు ఇవ్వాలన్నా సినిమా వాళ్లు ముందుకొస్తే ఆ ఎఫెక్ట్‌ వేరే లెవల్‌లో ఉంటుంది. అందరికీ తెలిసిన ముఖాలు, ఎంతోమంది ఆదర్శంగా తీసుకున్న నటులు అయితే యువత కానీ, జనాలు కానీ వింటారు అనే నమ్మకమే దానికి కారణం. అందుకే తెలంగాణలో సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ నియంత్రణ అవగాహన గురించి ప్రత్యేక వీడియోలు చేసి ఇవ్వండి అని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు.

ఈ నేపథ్యంలో చిత్ర‌సీమ త‌ర‌పున న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు త‌మ వంతు ప్ర‌య‌త్నం చేయాల‌ని అనుకుంటున్నారు. అది ముఖ్యమంత్రి అడిగినట్లు అవగాహన వీడియోలుగానా లేక ఏదైనా ప్రత్యేకంగా చేయాలా అని ఆలోచిస్తున్నారట. ఈ క్రమంలో ఓ పాటను సిద్ధం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందని భోగట్టా. అంటే డ్రగ్స్‌, సైబర్‌ నేరాల వల్ల వచ్చే ఇబ్బందుల్ని వివరించేలా ఓ పాటతో స్పెషల్‌ వీడియో సిద్ధం చేయాలని అనుకుంటున్నారట.

డ్ర‌గ్స్‌పై పోరాటంలో భాగంగా చిరంజీవి (Chiranjeevi) ఇప్పటికే ఓ వీడియో ఇచ్చారు. మిగిలిన స్టార్‌ నటులు కూడా ఆలోచనలో ఉన్నారట. సినిమా విడుద‌ల‌కు ముందు ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల తరహాలో ఇద్దాం అనే ఆలోచన చేస్తున్నారట. అయిత యువ క‌థానాయ‌కులు, క‌థానాయిక‌లు కొంత‌మంది క‌లసి డ్ర‌గ్స్‌కు వ్య‌తిరేకంగా ఓ వీడియో షూట్ చేయ‌డానికి రంగం సిద్ధం చేస్తున్నారట. దాదాపు తెలుగు సినిమాలోని యువ క‌థానాయ‌కులు, యువ కథానాయికలు ఈ వీడియోలో నటించే అవ‌కాశం ఉంది. దీని కోసం యువ సాంకేతిక నిపుణులు కూడా పని చేస్తారట.

థియేట‌ర్లలో సినిమా ప్రారంభానికి ముందు ఈ వీడియోను ప్రదర్శిస్తారు అని ఓ టాక్‌ నడుస్తోంది. అలాగే సినిమాల్లో డ్ర‌గ్స్‌, మ‌త్తు ప‌దార్థాల ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు కూడా డిస్‌క్లయిమర్లు వేసే ఆలోచన చేస్తున్నారట. ఇప్పటికే సిగరెట్‌, మద్యానికి ఇలా డిస్‌క్లయిమర్లు వేస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌, ఫిల్మ్‌ ఛాంబర్‌ కలసి ఈ స్పెషల్‌ వీడియోను సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నాయి అని చెబుతున్నారు. త్వరలో ఈ విషయంలో ప్రకటన ఉండొచ్చు అని చెబుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus