వర్షం కురిసి క్రికెట్ మ్యాచ్ క్యాన్సిల్ అయినట్టు.. 2020లో కరోనా అనే మహమ్మారి రావడంతో 3 నెలలకే బాక్సాఫీస్ మూలాన పడిపోయినట్టు అయ్యింది. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న చాలా సినిమాలు విడుదల కాలేకపోయాయి.కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కాలేదు. షూటింగ్ దశలో ఉన్న సినిమాలు.. ఆగిపోయాయి. ఇదిలా ఉండగా.. కొంత మంది నిర్మాతలు విడుదల చెయ్యాల్సిన తమ సినిమాలను పెట్టుకుని నెల నెల వాటికి లక్షల్లోనూ, కోట్లల్లోనూ ఇంట్రెస్ట్ లు కట్టడం ఇష్టం లేక.. ఓటిటిలకు ఫ్యాన్సీ రేటుకి అమ్మేసుకున్నారు. ‘వి’ వంటి క్రేజీ మూవీని నిర్మాత దిల్ రాజు.. పెద్ద అమౌంట్ కే అమెజాన్ ప్రైమ్ కు ఇచ్చేసాడు.
అంతేకాదు అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా విషయంలో కూడా నిర్మాతలు అదే పద్దతిని ఫాలో అయ్యారు. అయితే డిసెంబర్ ఎండింగ్ లో థియేటర్లు తెరుచుకోవడం.. సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు కూడా మంచి కలెక్షన్లను సాధించడంతో మెల్లమెల్లగా పెద్ద సినిమాల రాక మొదలైంది. ఇదిలా ఉండగా.. తమ అభిమాన హీరో సినిమా విడుదల కాకపోవడంతో 9నెలల పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ లతోనే కాలక్షేపం చేశారు ప్రేక్షకులు. అయితే వాళ్ళ ఆకలిని గుర్తించి అనుకుంట.. 2021 లో రెండేసి సినిమాలను విడుదల చెయ్యడానికి కొంతమంది హీరోలు రెడీ అయ్యారు. వాళ్ళెవరెవరు ఆ సినిమాలేంటి ఓ లుక్కేద్దాం రండి :
1) రవితేజ :
సంక్రాంతి ‘క్రాక్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ.. మే నెలలో ‘కిలాడి’ తో ప్రేక్షకులను మరోసారి పలకరించనున్నాడు. రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు.
2) శర్వానంద్ :
మార్చిలో ‘శ్రీకారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న శర్వా.. ఆగష్ట్ కు ‘మహా సముద్రం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
3) వెంకటేష్ :
మే నెలలో ‘నారప్ప’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న వెంకీ.. ఆగష్ట్ లో ‘ఎఫ్3’ సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
4) పవన్ కళ్యాణ్ :
ఏప్రిల్ లో ‘వకీల్ సాబ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న పవన్ కళ్యాణ్.. ఇదే ఏడాది రానాతో చేస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ తో కూడా అభిమానులను ఎంటర్టైన్ చేయనున్నాడు.
5) నితిన్ :
ఫిబ్రవరిలో ‘చెక్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న నితిన్.. మార్చిలో మళ్ళీ ‘రంగ్ దే’ తో థియేటర్లలో సందడి చేయనున్నాడు.
6) రాంచరణ్ :
రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం అక్టోబర్ లో విడుదల కాబోతుంది. అయితే దానికంటే ముందే సమ్మర్ కి అంటే మే నెలలో ‘ఆచార్య’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు చరణ్. ఈ చిత్రంలో 45 నిముషాల నిడివి గల సిద్ద అనే పాత్ర చేసిన సంగతి తెలిసిందే.
7) వరుణ్ తేజ్ :
కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో వరుణ్ తేజ్ చేస్తున్న ‘గని’ చిత్రం జూలై లో విడుదల కాబోతుంది. ఇక ఆగష్టులో ‘ఎఫ్3’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు వరుణ్.
8)విశ్వక్ సేన్ :
‘పాగల్’ అనే చిత్రంతో పాటు బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమా, అలాగే పి.వి.పి నిర్మాణంలో కూడా ఓ సినిమా చేస్తున్న విశ్వక్.. ఈ 3 చిత్రాలను ఇదే ఏడాది విడుదల చెయ్యబోతున్నాడని సమాచారం.
9) నాగ శౌర్య :
‘లక్ష్య ‘ అనే చిత్రంతో పాటు ‘వరుడు కావలెను’ అనే చిత్రాలతో ఈ 2021 లో సందడి చెయ్యబోతున్నాడు మన నాగ శౌర్య.
10) రానా :
‘అరణ్య’ తో పాటు ‘విరాట పర్వం’ సినిమాలను ఇదే ఏడాది విడుదల చెయ్యబోతున్నాడు.అంతేకాకుండా పవన్ తో కలిసి నటిస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ కూడా ఇదే ఏడాది విడుదల కాబోతుంది.
11) శ్రీవిష్ణు :
‘రాజ రాజ చోర’ అనే చిత్రంతో పాటు ‘గాలి సంపత్’ అనే క్రేజీ మూవీని కూడా ఈ 2021 లోనే విడుదల చేయబోతున్నాడట శ్రీవిష్ణు.
12) నాని :
టక్ జగదీష్ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చెయ్యబోతున్నాడు. దాంతో పాటు ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాన్ని కూడా ఇదే ఏడాది విడుదల చేయబోతున్నాడట.
13) ఆది సాయికుమార్ :
‘శశి’ తో పాటు ‘జంగిల్’ అనే చిత్రాన్ని కూడా ఈ 2021లోనే విడుదల చేయబోతున్నాడట.