సినిమాల సంఖ్య తక్కువైనా అభిమానుల సంఖ్య ఎక్కువే!

తొలితరం హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలు పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడి మూడు వందల చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ తదితరులు సెంచరీ కొట్టారు. నేటి తరం హీరోలు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నారు. స్లో అండ్ స్టడీ మంత్రాన్ని జపిస్తున్నారు. ఎన్ని చిత్రాలు చేశామన్నది కాదు అన్నయ్య.. ఎన్ని హిట్ కొట్టామా? అన్నదే ఇప్పటి ట్రెండ్ అంటూ చెబుతున్నారు. వారి సినిమాల సంఖ్య చూస్తే ఈ మాట నిజమనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రంగంలోకి 1996లో వచ్చారు. అంటే ఇప్పటికే 21 సంవత్సరాలు అవుతోంది. ఏడాది రెండు సినిమాలు వేసుకున్నా 40 దాటాలి. కానీ 25 కూడా దాటలేదు. గెస్ట్ అప్పీరియన్స్ తో కలుపుకొని 24 పూర్తి చేశారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా సంఖ్య 25.

ఆ తర్వాత మరింత స్లో కానుంది. ఇక మహేశ్‌బాబు 1999లో “రాజకుమారుడు” చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. పద్దెనిమిదేళ్ళకి కేవలం 23 చిత్రాలు మాత్రమే చేయగలిగారు. ప్రస్తుతం మహేశ్ బాబు నటిస్తున్న “భరత్ అనే నేను” మహేశ్ 24వ సినిమా. దీన్ని తర్వాత  మహేశ్‌ 25వ చిత్రంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో త్వరలో ప్రారంభం కానున్నది. ఈ మూవీ వచ్చే ఏడాది దసరాకి రిలీజ్ కానుంది. స్లోగా సినిమాలు చేస్తున్న హీరోల జాబితాలో గోపిచంద్ ఉన్నారు. గోపీచంద్. 2001లో ‘తొలివలపు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. హీరోగా విజయం రాకపోవడంతో విలన్ అవతారమెత్తారు. మళ్ళీ హీరోగా టర్న్ తీసుకున్నారు.  2004లో “యజ్ఞం” సినిమాతో హీరోగా గోపీచంద్‌ నిలబడ్డారు.  ఆ తర్వాత మరికొన్ని హిట్స్ సొంతం చేసుకున్నారు. అయినప్పటికీ జోరు పెంచలేదు. మెల్లగా 25 వ చిత్ర మైలు రాయికి చేరుకున్నారు. త్వరలో రిలీజ్ కానున్న ఆక్సిజన్ సినిమా గోపిచంద్ 24 వ సినిమా. దీని తర్వాత యువ దర్శకుడు చక్రవర్తి దర్శకత్వంలో 25వ చిత్రం చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus