టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత ఇకలేరు!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్‌ నిర్మాత కాట్రగడ్డ మురారి (78) కన్నుమూశారు. చెన్నైలోని ఆయన నివాసంలో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1944 జూన్‌ 14న విజయవాడలో జన్మించారు కాట్రగడ్డ మురారి. మురారి మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మృతి వార్త విని పలువురు సెలబ్రిటీలు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.

కాట్రగడ్డ మురారి యువచిత్ర ఆర్ట్స్‌ పేరుతో 90వ దశకం వరకు చాలా విజయవంతమైన సినిమాలను నిర్మించారు. డాక్టర్‌ చదువు మానేసి మరీ దర్శకుడవుదామని చిత్రరంగ ప్రవేశం చేశారు మురారి. అయితే దర్శకుడు కాకుండా.. నిర్మాతగా మారి కళామ్మతల్లి సేవ చేశారు. ‘సీతామహలక్ష్మి’, ‘గోరింటాకు’, ‘జానకి రాముడు’, ‘నారి నారి నడుమ మురారి’, ‘అభిమన్యుడు’, ‘సీతారామ కల్యాణం’, ‘శ్రీనివాస కల్యాణం’, ‘జేగంటలు’ తదితర చిత్రాలు ఆయన నిర్మాణ సంస్థ నుండి వచ్చినవే.

మురారి నిర్మించిన అన్ని సినిమాలకు దివంగత, ప్రముఖ సంగీత దర్శకుడు కేవీ మహదేవనే సంగీతం అందించడం గమనార్హం. కాట్రగడ్డ మురారి 2012లో ‘నవ్విపోదరు గాక’ పేరుతో తన ఆత్మకథ రాశారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus